తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడిన వ్యక్తిని. నన్ను చంపాలని రెక్కీ నిర్వహించినా కూడా తెలంగాణ జెండా పట్టుకొని ఎదురెళ్లాను. పార్టీలోకి మధ్యలోకి వచ్చిన వాడిని కాదు. గులాబీ జెండా ఓనర్లలో ఒకడిని. పదవులను అడుక్కునే వాడిని అసలే కాదు. నా మంత్రి పదవి ఎవరి భిక్షా కాదు. బీసీ కోటాలో మంత్రి పదవి కావాలని ఎన్నుడు కూడా అడగలేదు. అధికారం శాశ్వతం కాదు ధర్మం, న్యాయం శాశ్వతం. ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప నాయకులు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కుహానావాదులు, సంకుచిత బుద్ధితో వ్యవహరించేవారు జాగ్రత్తగా ఉండాలి. సొంతంగా ఎదగలేని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరు హీరోనో ఎవరు జీరోనో త్వరలో తెలుస్తుంది ఇవీ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలు.
ఈటల వ్యాఖ్యలతో రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గులాబీ జెండా ఓనర్లలో ఒకడినని, మధ్యలో వచ్చిన వాడిని కాదంటూ ఈటల అన్న మాటలు ఎవరికి తాకాలో వారికే తాకాయనే టాక్ వినిపిస్తోంది. నిజానిక.. మొదటి నుంచీ గులాబీ జెండా మోసిన వాళ్లకు పార్టీలో, ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం దక్కడంలేదనే వాదన తెలంగాణవాదుల్లో మొదటి నుంచీ ఉంది. మధ్యలో టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన నేతలే ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారని, వారికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి ఈటల చెప్పకనే చెప్పేశారని పలువురు నాయకులు అంటున్నారు.
నిజానికి.. గత ప్రభుత్వం ఈటల ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ.. 2019 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ నుంచి ఈటలను తప్పించి మరోశాఖ ఇచ్చారు. ఇక అప్పటి నుంచే మంత్రి ఈటల రాజేందర్ దాదాపుగా సైలెంట్ అయిపోయారు. కేవలం తన నియోజవర్గానికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే మంత్రివర్గం నుంచి ఈటలను తప్పిస్తారనే టాక్ మొదలైంది. చాలాకాలంగా ఈ ప్రచారం జరుగుతున్నా.. ఈటల ఎన్నడు కూడా స్పందించలేదు.
ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు చేయడంతో గులాబీగూటిలో కలకలం రేగుతోంది. ఈటల మాటలు ప్రభుత్వంలోని కొందరి పెద్దలకు సూటిగా తాకుతాయని, ఆ విషయం వారికి కూడా తెలుసుననే టాక్ రాజకీయవర్గాల్లో మొదలైంది. ఇక మధ్యలో వచ్చింది.. వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యం గురించి.. తెలంగాణ ప్రజలందరికీ తెలుసునని గులాబీ శ్రేణులు గుసగులాడుకుంటున్నాయి. మధ్యలో వచ్చిన వారి పెత్తనమే ఎక్కువై పోయిన నేపథ్యంలోనే మంత్రి ఈటల ఇలా ఉద్వేగపూరితంగా మాట్లాడారనే టాక్ వినిపిస్తోంది