హైడ్రాపై కావాలనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని హైడ్రాను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు.రేపటి కోసం అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను ప్రభుత్వం తొలగించుకుంటూ ముందుకెళ్తుందని వెల్లడించారు. వర్షాలు వచ్చినప్పుడు మరో చెన్నై, బెంగళూరు కాకూడదనే ఉద్దేశంతోనే హైదరాబాద్‌లోని చెరువులను ఆక్రమణల నుంచి కాపాడుతున్నామని చెప్పారు.
ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. అక్రమ నిర్మాణలు, కబ్జాలు,ఆక్రమణల జోలికి మాత్రమే హైడ్రా వెళ్తుందని, అమాయకులను ఇబ్బంది పెట్టడం లేదని తెలిపారు.నగర ప్రజలందరూ హైడ్రాకు సహకరించాలని, ఆక్రమణలకు పాల్పడినవారే స్వచ్ఛందంగా వదులుకోవాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. కాగా, హైడ్రా కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు లీగల్ ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.