ఎన్టీఆర్ విజ్ఞప్తి మేరకు స్వదేశానికి వచ్చిన కాకర్ల ఇక లేరు

-

ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చేరిన ఆయన ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కాకర్ల సుబ్బారావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాకర్ల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు.

కాగా కాకర్ల సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో జన్మించారు. విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్‌ పట్టా పొందారు. 1951లో హౌస్‌ సర్జన్‌ చేసిన అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన అయన… 1955లో అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. 1954-56 మధ్యలో అమెరికాలోని ఆసుపత్రుల్లో పనిచేశారు. అనంతరం 1956లో తిరిగి స్వదేశానికి వచ్చారు.అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరిన తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి కూడా పొందారు. అనంతరం 1970లో మళ్లీ అమెరికా వెళ్ళిన ఆయన… యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఫెల్లో ఆఫ్‌ రాయల్‌ కాలేజి ఆఫ్ రేడియాలజిస్టు పట్టా పొందారు.

అనంతరం 1986లో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరకు కాకర్ల సుబ్బారావు తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చి నిమ్స్‌ డైరెక్టర్‌గా సేవలు అందించారు. కీలక బాధ్యతలు చేపట్టారు. నిమ్స్‌లోని అన్ని విభాగాలను అభివృద్ధి చేయడంతో పటు రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా నిమ్స్‌ను తీర్చిదిద్దారు. కాగా 50 ఏళ్లుగా వైద్య రంగంలో సేవలు అందించిన ఆయనకు 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో పాటు అనేక బహుమతులు, సత్కారాలు లభించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version