రోజు రోజుకు బంధాలకు విలువ లేకుండా పోతోంది. మూఢనమ్మకాలతో చేయరాని పనులు చేస్తున్నారు కొందరు. ఓ తండ్రి తన కూతురును 36 ఏళ్లుగా ఇంట్లోనే బంధీగా ఉంచారు. ఇప్పుడు ఆమెకు 53 సంవత్సరాలు. ఆమె తన జీవితంలోని చాలా ముఖ్యమైన సమయం కనీసం సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలిని పొందకుండానే గడిపేసింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మేయర్, స్థానిక ఎమ్మెల్యే, ఓ ఎన్జీవో కలిసి ఆమెకు విముక్తి కల్పించారు. వివరాల ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ తుండ్లా ప్రాంతంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సప్నా జైన్ (53)కు మానసిక ఆరోగ్యం సరిగా ఉండదు అనే కారణంతో 36 ఏళ్ల కిందట బంధీగా మారింది. ఆమెను తండ్రి ఓ గదిలో గొలుసులతో బంధించి ఉంచారు. బాధితురాలికి అప్పుడు 17 ఏళ్ల వయస్సు మాత్రమే ఉంది. అప్పటి నుంచి ఆమెకు ఆ కుటుంబ సభ్యులు తలుపు కింది నుంచి భోజనం పంపించేవారు.
అలా తింటూనే ఆమె కాలం వెల్లదీసేది. ఆ గదిలోనే మల మూత్ర విసర్జన కూడా చేసేది. కిటికిలో నుంచి నీళ్లు పోస్తూ ఆమెకు స్నానం చేయించేవారు. 36 ఏళ్లు ఇలాగే గడిచిపోయాయి. అప్పటి నుంచి ఆమె తన గదిలో నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడలేదు. కాగా.. సప్నా తండ్రి గిరీష్ చంద్ ఇటీవల మరణించారు. ఆ సమయంలో స్థానిక స్వచ్ఛంద సేవా భారతి సభ్యులు ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ బాధితురాలి పరిస్థితిని చూసి చలించిపోయారు. ఆమె చుట్టూ మురికి పేరుకపోయి ఉంది. దీంతో సేవా సంస్థలోని మహిళా బృందం ఆమెకు స్నానం చేయించారు. కొత్త బట్టలు అందించారు.