అన్నదాతల బలవన్మరణం.. ఎందుకంటే..!

-

అభివృద్ధి కార్యక్రమాలు.. రైతు భరోసాలు.. వ్యవసాయ చట్టాలు వీటన్నిటి ముఖ్య ఉద్దేశం అన్నదాతకు అండగా ఉండటమే.. కానీ రైతుల అప్పుల బాధ నానాటికీ తీరని సమస్యగా మారుతోంది. ప్రభుత్వాలు తీసుకొచ్చే పథకాలు కంప్యూటర్లలో పేర్ల నమోదు వరకే సరిపోతుంది. దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూల రైతు ఊపిరాగుతోంది. అప్పులబాధతో కుమార్తె పెళ్లి చేయలేక చనిపోతే బీమా డబ్బులైనా వస్తాయి.. వాటితో పెళ్లి చేయిస్తారుకుని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలో జరిగింది. పండుగ రోజుల్లోనే రాష్ట్రంలో నలుగురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

farmer
farmer

కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలోని లక్మాపూర్‌ గ్రామానికి చెందిన రాఠోడ్‌ బాపురావు(45) తన ఐదు ఎకరాలతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశారు. ఇందుకోసం రూ.2 లక్షలకుపైగా అప్పు తీసుకున్నాడు. ఈ ఏడాది పంట దిగుబడి సరిగా లేదు. ఇటీవల కుమార్తె పెళ్లి నిశ్చయమైంది. తాను చనిపోతే వచ్చే రూ.5 లక్షల రైతుబీమా డబ్బులతో అప్పులు తీరడంతో పాటు కూతురు పెళ్లి జరుగుతుందని శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగాడు.

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్‌ గ్రామానికి చెందిన అయ్యలిగారి సత్యారెడ్డి (30). ఎనిమిది ఎకరాలలో సన్నరకం వరి సాగుచేశాడు. ఇటీవలి అధిక వర్షాలకు వరి పైరు నేలమట్టమైంది. దీంతో సాగు కోసం తెచ్చిన అప్పు రూ.5 లక్షలు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురై శుక్రవారం అర్ధరాత్రి పొలం వెళ్లి పురుగు మందు తాగాడు.

ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం పాఠన్‌ గ్రామానికి చెందిన ఠాక్రే ఉత్తమ్‌(50) తనకున్న 3 ఎకరాలతోపాటు 5 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. గులాబీ పురుగు ఉద్ధృతితో పంట దెబ్బతిని దిగుబడి తగ్గింది. దీంతో సాగుకు చేసిన అప్పులు తీరేలా లేదంటూ శనివారం ఉదయం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య, కొడుకు, ముగ్గురు కుమార్తెలున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని పోచారం తండాకు చెందిన రైతు వాంకుడోత్‌ చంద్రు(40) శనివారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మొక్కజొన్న, వరి సాగు చేయగా ఇటీవల అకాల వర్షాలకు మొక్కజొన్న దిగుబడి తగ్గడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. దీంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news