పది లక్షల సంతకాల సేకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నమయ్య గృహ సాధన సమితి జైభారత్ కార్యదర్శి రాజు అన్నారు. మంగళవారం మొయినాబాద్ దగ్గర్లోని చిలుకూరు బాలాజీ ఆలయంలో అన్నమయ్య గృహసాధన సమితి సభ్యులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమయ్య ఇంటిని, ఆలయ నిర్మాణానికి తమ వంతుగా సంతకాలు సమర్పించారు.
ఈ సందర్భంగా జై భారత్ రాజు మాట్లాడుతూ.. టీటీడీ దేవస్థానం అన్నమయ్యకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. 2003లో అన్నమయ్య ఇంటిని, ఆలయాన్ని, మండపాన్ని కూల్చివేసింది. ఇంటిని పునఃనిర్మిస్తామని చెప్పి.. ఇప్పటికీ నిర్మించలేదన్నారు. దాదాపు 19 ఏళ్లు దాటినా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇంటి నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. త్వరలో టీటీడీ అన్నమయ్య ఇంటిని పునఃనిర్మించాలన్నారు.
ఈ క్రమంలో జైభారత్ రాజకీయేతర విప్లవ వేదిక పోరాటం చేస్తోంది. ఈ మేరకు జై భారత్ ట్రస్ట్ కార్యకర్తలు 10 లక్షల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై.. సంతకాలు సమర్పించాలని జై భారత్ కార్యదర్శి రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖదిజ్ఞాసి రాజు, ఖదిజ్ఞాసి గార్లపాటి లావణ్య, ఖదిజ్ఞాసి గోవిందు లావణ్య, ఖదిజ్ఞాసి అరవింద్, ఖదిజ్ఞాసి లక్ష్మేశ్వర్, ఖదిజ్ఞాసి అంజి తదితరులు పాల్గొన్నారు.