మరికొన్ని గంటల్లోనే 5 రాష్ట్రాల్లో కింగ్ ఎవరో.. కింగ్ మేకర్ ఎవరో తెలియబోతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ ఎన్నికలపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. రేపు ఎన్నికల రిజల్ట్ వెలువడుతున్న తరుణంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ నిజమవుతాయా…లేదా అనేదానికి రేపటితో తెర పడనుంది.
ఇదిలా ఉంటే క్యాంపు రాజకీయాలు మాత్రం అప్పుడే షురువయ్యాయి. ఇప్పటికే గోవాలో క్యాంపు రాజకీయాలకు తెరలేసింది. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ, కాంగ్రెస్ పెద్దలు గోవాకు చేరుతున్నారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉండగా… 21 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. అయితే ఇటు కాంగ్రెస్కు కానీ.. అటు బీజేపీకి కానీ క్లియర్ కట్ గా మెజారిటీ వస్తుందనేది సందేహమే. ఎందుకంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ గోవాలో ఏ పార్టీకి మెజారిటీ రాదని అభిప్రాయపడుతున్నాయి.
దీంతో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ తో పాటు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం గోవా రాజధాని పనాజీకి చేరుకున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ కూడా మెజారిటీ తక్కువ అయినా.. వేరే పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేసే ప్రయత్నంలో ఉంది. ఏ మాత్రం మెజారిటీ తగ్గినా.. ఇతర పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోవాకు చేరుకున్నారు. రేపటి రిజల్ట్ వచ్చిన తర్వాత గోవా రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.