హైదరాబాద్ నగర నడిబొడ్డున.. తెలంగాణ అస్తిత్వ వైభవానికి ప్రతీకగా కొలువుదీరిన కొత్త సచివాలయం నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు సచివాలయ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. అటు నుంచి నేరుగా తన ఛాంబర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. వేద పండితుల ఆశీర్వాదాల మధ్య కుర్చీలో ఆసీనులయ్యారు. విధులు స్వీకరించిన అనంతరం.. మొట్టమొదట కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఫైలుపై కేసీఆర్ తొలి సంతకం చేశారు.ఇక ఈ రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఆదివారం బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తన కార్యాలయంలో విత్తనాల సబ్సిడీ పై తొలి సంతకం చేశారు. అంతకు ముందు మంత్రి దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సబ్సిడీ విత్తనాల కోసం ప్రభుత్వం రూ. 76.66 కోట్లు వెచ్చించనుందని మంత్రి పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గం లో చెక్ డ్యాంల నిర్మాణం కోసం రెండో సంతకం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో నిర్మాణం పూర్తైన 10 చెక్ డ్యాంలు అందుబాటులోకి రాగా మరో రెండు చెక్ డ్యాంలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి అధనంగా మరో 18 చెక్ డ్యాంల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించనున్నట్లు మంత్రి వెల్లడించారు.