తనవాళ్లకు పదవులు ఇచ్చే వేళ కేసీఆర్ బాగుంటారు
తన వాళ్లకు అన్నీ దక్కించేందుకు ఇష్ట పడతారు
కోపం మాత్రం మోడీపై ఉన్నా అది కేవలం పైకి కనిపించే
భావోద్వేగం. లోపల ఉద్దేశాలు కొన్ని ఢిల్లీ కేంద్రంగా ఎప్పటికప్పుడు
వెలుగులోకి వస్తూనే ఉంటాయి.. అవి 4 గదుల మధ్య 4 గడుల మధ్య
ఉండిపోతాయి.
తెలంగాణ సాధకుడు అయిన కేసీఆర్ (ఆయన చెప్పుకునే మాట ఇది.. ఈ మాటతో గద్దర్ విభేదిస్తారు కనుక తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చెప్పుకునే మాటగానే దీనిని పరిగణించి ఊరుకోవాలి) ఎలా ఉన్నారు అనే ప్రశ్న ఈ వారం ఈ ఆదివారం వేసుకోవాలి. ఎలా ఉన్నారంటే.. మంచి చేసే విధంగా ఉన్నారా అని.. రాజకీయంగా ఎదిగే శక్తిగా ఉన్నారా లేదా దిగజారే శక్తిగా ఉన్నారా.. ఇవేవీ కాకుండా కేసీఆర్ ఎలా ఉన్నారు. ఫాం హౌస్ లో ఉన్నారా లేదా ఢిల్లీ వీధుల్లో వేడుకగా ఉన్నారా అన్నది కూడా చర్చకు తావిస్తున్న విషయం. ఏదేమయినప్పటికీ కేసీఆర్ కొత్త వ్యూహం ఒకటి సిద్ధం చేస్తున్నారు.
తన వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చే విషయమై బాగానే ఉన్నారు. బాగానే అనగా జగన్ మాట కాస్త విని హెటిరో కంపెనీ అధినేత పార్థసారథి రెడ్డి కి పదవి ఇచ్చారు. తన వాళ్లే అయిన గ్రానైట్ వ్యాపారి గాయత్రి రవి కి, తన వాళ్లే అయిన నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్-కు పదవులు ఇచ్చి రాజ్యసభకు పంపే క్రమంలో పెద్దలను చేశారు. ఓ విధంగా వీళ్లంతా నిన్నటిదాకా చిన్నవాళ్లే కదా అందుకని పెద్దలను చేశారనుకోవాలి.
ఇక ఢిల్లీ డీల్స్ కు వెళ్లారు కేసీఆర్. అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. అక్కడి పాఠశాలలు, అక్కడ అమలవుతున్న పథకాలు వీటన్నంటి గురించి తెలుసుకున్నారు. వీలుంటే పంజాబ్ వీలుంటే బెంగళూరు ఇలా నచ్చిన చోటుకు నచ్చిన రీతిన తిరిగి వచ్చేందుకు కేసీఆర్ ఓ ప్రణాళిక వేసుకున్నారు. కానీ కేసీఆర్ మాటనే వారంతా ప్రామాణికంగా తీసుకుంటారా? అంటే చెప్పలేం. ములాయం సింగ్ యాదవ్ తో కూడా భేటీ అయ్యారు. సమాజ్ వాదీ అధినేత తో కూడా మాట్లాడారు.
ఏం మాట్లాడినా బలమైన బీజేపీతో ఢీ కొనడం మాత్రం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. పైకి మాత్రమే ఇవన్నీ చెబుతూ హాయిగా ఢిల్లీ కేంద్రంగా బీజేపీ సర్కారు సాయంతోనే తెలంగాణ భవన్ అత్యంత ఆధునిక సొబగులతో ఉండే విధంగా నిర్మిస్తూ, ఆత్మ గౌరవ పతాకగా తనను తాను అభివర్ణించుకోవడం అన్నదే ఇక్కడ హాస్యాస్పదంగా ఉంది. ఇదీ ఇవాళ కేసీఆర్.. ఈ వారం కేసీఆర్ కూడా !