ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీర చక్ర అవార్డు అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీర్‌చక్రను ప్రదానం చేశారు. ఇటీవల అభినందన్ వర్ధమాన్ వింగ్ కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్‌గా పదోన్నతి పొందారు.
బాలకోట్ వైమానిక దాడుల తర్వాత రోజు ఫిబ్రవరి 27న జరిగిన వైమానిక పోరులో పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్-16ను అభినందన్ కూల్చి వేశారు. ఈ క్రమంలో ఆయన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించారు. వర్ధమాన్‌కు చెందిన మిగ్-21 యుద్ధం విమానం కూలిపోయింది. ప్యారాచూట్ సాయంతో ఆయన సురక్షితంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో దిగారు. ఆయన్ని పాకిస్తాన్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నది. అయితే, అంతర్జాతీయ స్థాయిలో భారత్ తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో పాకిస్తాన్ సైన్యం అభినందన్‌ను సురక్షితంగా భారత్‌కు అప్పగించింది.
2019, ఫిబ్రవరి 26న పాకిస్తాన్ భూభాగంలోని కైబర్ ఫక్తువాలోని ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహమ్మద్ స్థావరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రతిగా భారత్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు దిగింది. ఆ సమయంలో శ్రీనగర్‌కు చెందిన 51 స్క్వాడ్రన్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న అభినందన్ వర్ధమాన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.