బ్రేకింగ్ : సిద్దిపేటలో గన్ మిస్ ఫైర్.. ముస్లిం వ్యక్తి మృతి

సిద్దిపేట జిల్లా లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌ గన్‌ మిస్‌ ఫైర్‌ అయి… ఓ ముస్లిం వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం సలాక్ పూర్ గ్రామంలో ఎయిర్ గన్ మిస్ ఫైర్ అయి ముసాఫ్ ఖాన్ అనే యువకుడు మృతి చెందాడు. సలాక్ పూర్ గ్రామం లో ఫజిల్ అనే వ్యక్తి ఇంటికి ఎనిమిది మంది హైదరాబాద్ స్నేహితులు వచ్చారు.

ఈ నేపథ్యంలోనే… వారంతా నిన్న రాత్రి విందు చేసుకున్నారు. ఈ క్రమంలో షికారు కు చెందిన ఎయిర్ గన్ మిస్ ఫైర్ అయి ముసాఫ్ ఖాన్ అనే యువకుడి తలకు బలంగా తగిలింది. దీంతో అప్రమత్తమైన అతని స్నేహితులు… సలాక్ పూర్ నుండి సిద్దిపేటకు ఆస్పత్రికి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే.. ముసాఫ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమిచండంతో మార్గ మధ్యలోనే మృతి చెందాడు. అయితే.. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు.