సామాన్యులు వచ్చే సామాన్య ఆస్పత్రికి సంబంధించి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. సామాన్య ఆస్పత్రి అంటే ప్రభుత్వాలు అందించే వైద్యానికి సంబంధించిన ఆస్పత్రులు. ఏటా వందల కోట్ల నిధులు కేవలం వైద్యం పేరిట ఖర్చు అయిపోయినా కూడా కనీస వసతులు ఆ సామాన్య ఆస్పత్రుల్లో ఉండవు. దక్కవు. కరోనా సమయంలో ఆస్పత్రుల నిర్వహణ కాస్త గాడిలో పడినా మళ్లీ సమస్య మొదటికే వచ్చింది. అపరిశుభ్ర వాతావరణం నడుమ, కొట్టొచ్చిన నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతూ ఆస్పత్రుల నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చిన సందర్భాలు ఎన్నో ! అయినా కూడా మంత్రి వచ్చారు కదా కనుక సంబంధిత సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని అనుకోవడం అత్యాశ. మళ్లీ ఆమె నెలకోసారి తనిఖీలు చేయాల్సిందే. అప్పుడే కాస్తయినా అక్కడి వాతావరణంలోనూ, నిర్వహణ సంబంధ పనుల్లోనూ మార్పు వస్తుందని సామాన్యుల ఆశ.
గుంటూరు ఆస్పత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆమె వెంట ఉన్నతాధికారులు ఉన్నారు. అత్యవసర సేవల విభాగానికి సంబంధించి ఆరు నెలలుగా ఏసీలు పనిచేయడం లేదని గుర్తించారు. ఏం చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొందరు రోగులు ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకుని వెళ్లి వివరించారు. ఇక మంత్రి తనిఖీలతో ఆస్పత్రి పనితీరుపై మార్పు వస్తుందని ఆశించాలి. వాస్తవానికి మంత్రులు తనిఖీలు తరువాత అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాల అమలు అన్నది అంత వేగంగా జరగవు. ముఖ్యంగా నెలల తరబడి తిష్ట వేసిన సమస్యల పరిష్కారంపై అధికారులు తీసుకునే చొరవ అన్నది అంతంత మాత్రంగానే ఉంటుంది.ఈ నేపథ్యంలో మంత్రి తనిఖీలు ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నది చూడాలి.
నిర్లక్ష్యానికి నెలవు :
ఒక్క గుంటూరు అనే కాదు అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనూ సరైన విధంగా తనిఖీలు చేయాల్సిందే ! తనిఖీలు తరువాత తదుపరి పనులు ఏ విధంగా ఉన్నాయన్నది ఆరా తీయాల్సిందే ! ఇప్పటికే వైద్య మరియు ఆరోగ్య శాఖకు ప్రభుత్వం నిధులు కేటాయింపులో ఎక్కడా అలసత్వం చూపడం లేదని సీఎం కూడా చెబుతున్నారు.