సీఎం జగన్ నొక్కే ప్రతి బటనుకు బ్యాటరీ కేంద్రమేనని… బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. ఏపీలో అమలవుతోన్న సంక్షేమ కార్యక్రమాల నిధులు కేంద్రానివేనని.. ఏపీలో కేంద్రం ఇస్తోన్న ఉచిత బియ్యాన్ని ఏప్రిల్ నెల నుంచి ఆపేసిందని పేర్కొన్నారు. మోడీకి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యాన్ని ప్రభుత్వం నిలిపేసిందని… లక్షా 20 టన్నుల బియ్యం కావాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 14 లక్షల టన్నులు ఉందని వెల్లడించారు.
కేంద్రం బియ్యం ఇవ్వడం లేదని ఏపీ అధికారులు అబద్దాలు చెబుతున్నారని… పండుగ వాతావరణంలో ప్లీనరీ చేసుకుంటూ.. పేదలకి బియ్యం ఇవ్వకుండా పొట్టకొడతారా..? అని నిలదీశారు. కేంద్రం ఇచ్చే బియ్యం సరఫరా చేయని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీన జిల్లా స్థాయిలో.. 18వ తేదీన మండల స్థాయిలో ధర్నాలు చేపడతామని ప్రకటించారు బీజేపీ ఎంపీ జీవీఎల్. రేపు రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము ఏపీకి రాబోతున్నారు… ముర్ము అభ్యర్థిత్వం విషయంలో రాజకీయాలు చేయడం సరి కాదన్నారు.