అప్పుడప్పుడూ భావోద్వేగాలు గీతలు దాటుతాయి.. అప్పుడప్పుడూ అయినా కంటి నీరు కట్టలు తెగి ఇతరుల ఎదుట బయటపడుతుంది. అణుచుకోలేని ఆవేదన పాపం ఏపీ మంత్రులది. పదవి ఉన్నంత కాలం బూతులు తిట్టిన కొడాలి నాని కానీ బూతులు తిట్టిన వెల్లంపల్లి కానీ ఇష్టానుసారం మాట్లాడి వివాదాలు కొని తెచ్చుకున్న పేర్ని నాని కానీ పాపం ఇప్పుడు ఏమయిపోతారో ? పదవి ఉన్నా లేకపోయినా తాను జగన్ విధేయుడినేనని ఒక్క కొడాలి నాని తప్ప ఇంకెవ్వరూ అంత స్పష్టంగా చెప్పలేదు.
ఇకపై చెప్పరు కూడా ! బొత్స కూడా కంటిన్యూ కావడం కష్టమే ఒకవేళ కంటిన్యూ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఓ ప్రాథమిక ఆధారం. ఈయనతో పాటు పెద్దిరెడ్డి కూడా ఇంటికే అంటున్నారు. అయితే రెడ్డి స్థానంలో రెడ్డి వస్తే, కమ్మ స్థానంలో కమ్మ వస్తే చాలా బాగుంటుందని సీఎం అనుకుంటున్నారు. అందుకే ఇదే కోవలో ఇదే తోవలో నాయుడు స్థానాన్ని నాయుడికే అప్పగించారు మళ్లీ ..అని అంటున్నారు. ఆ విధంగా శ్రీకాకుళం వరకూ న్యాయం జరిగింది. మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే జరగబోతోంది.
మీరు బాధపడవద్దు అని జగన్ చెప్పినా పేర్నినాని భావోద్వేగాలు ఆపుకోలేకపోయారు. క్యాబినెట్ లో తాను ఉంటానని తెలిసినా ఆదిమూలం మాత్రం జగన్ కోసం తలకోసుకుంటానని మరీ బిల్డప్ మాటలు కొన్ని చెప్పారు. నా విశ్వరూపం చూపిస్తా అని మళ్లీ కొడాలి నాని బ్రేకింగ్ న్యూసులు వదిలారు. అదేవిధంగా పవన్ పై నోరేసుకుని పడిపోయారు పేర్ని నాని. ఇక అంతా కలిసి ఏడ్చుకుంటూ రొప్పుకుంటూ సచివాలయం గుమ్మం దాటి తమ తమ పేషీలకు ఎటువంటి పేచీలు లేకుండానే వీడ్కోలు చెప్పారు.
నా ప్రాణం ఉన్నంత వరకూ జగన్ ను సీఎంగా చూడాలనుకుంటున్నా అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వింత వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి అనుచరుడిగా పేరున్న ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా పెద్దాయన టూమచ్ గానే మాట్లాడారు. సభలో కూడా ఆయన ఈ విధంగా మొన్న మాట్లాడారు. అప్పుడు బూతులు ఇప్పుడు నీతులు అంతే తేడా ! ఏదేమయినా బూతుల మంత్రులు ఇంటికివెళ్లినా ఉమ్మడి కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం నుంచి జోగి రమేశ్ కు కనుక మంత్రి వర్గంలో చోటు ఇస్తే కొత్త శైలిలో తిట్ల పురాణాలు తప్పక వినపడతాయి. ఏదేమయినా నిన్నటి డ్రామా బాగుంది. ఎమోషనల్ కంటెంట్ కాస్త ఎక్కువైంది.