ఈటల రాజేంద్ర హుజురాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసినప్పటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీలో జాయిన్ అయిన ఈటల రాజేంద్ర, ఉపఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగా సమావేశాలు, పాదయాత్రలు చేపడుతున్నారు. తాజాగా ఈటల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తనవల్లే దళిత బంధు వచ్చిందని, నేను రాజీనామా చేయకపోతే అసలు ప్రగతి భవన్ నుండి సీఎమ్ కేసీఆర్ బయటకు వచ్చేవారే కాదని, స్థలం ఉన్నవాళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పిన మాట ఇప్పటి వరకు అమలు కాలేదని వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో హరీష్ రావు ఫైర్ అయ్యారు. కమ్యూనిస్టు వాదినని చెప్పుకునే ఈటల మతతత్వ పార్టీలో చేరారని, కాషాయ జెండా పట్టుకుని ఎర్రజెండా మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఇంకా హుజురాబాద్ ఉపఎన్నికల్లో గెలవడానికి అనేక ప్రలోభాలకు పోతున్నారని, ఆస్తులు కాపాడుకోవడం కోసమే ఈటల రాజీనామా చేసారని వ్యాఖ్యానించారు.