ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వరదల్లో ఇల్లు, వాహనాలు కొట్టుకుపోతున్నాయి. రాష్ట్రంలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో వరద బీభత్సానికి ముగ్గురు నేపాలీలు సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. వరదల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ దామి తో మాట్లాడారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ప్రజలు సతమతమవుతుంటే ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉంటే కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కేరళ లో భారీ వర్షాల కారణంగా వరదల్లో 30 మందికి పైగా మరణించారు. వరద బాధితుల కోసం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.