చికోటి ప్రవీణ్‌ వ్యవహారంలో పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

క్యాసినో వ్య‌వ‌హారంలో అక్ర‌మ లావాదేవీల‌కు పాల్ప‌డ్డారంటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చీకోటి ప్ర‌వీణ్‌కు భ‌ద్ర‌త క‌ల్పించే విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని తెలంగాణ హైకోర్టు గురువారం హైద‌రాబాద్ పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అక్ర‌మ లావాదేవీల వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే చీకోటి ప్ర‌వీణ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ విచారించిన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ‌లో భాగంగా ప‌లువురు రాజకీయ నేత‌ల పేర్ల‌ను తాను ఈడీ అధికారుల‌కు వెల్ల‌డించిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, ఈ క్ర‌మంలో త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని, త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని పోలీసులను ఆదేశించాల‌ని కోరుతూ ప్ర‌వీణ్ ఈ నెల 4న హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌తో పాటు త‌న కుటుంంబ స‌భ్యుల‌కు కూడా భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆయ‌న త‌న పిటిష‌న్‌లో కోర్టును అభ్య‌ర్థించారు.

Telangana High Court - The Siasat Daily

ఈ పిటిష‌న్‌పై గురువారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు ప్ర‌వీణ్ విజ్ఞ‌ప్తిని వారంలోగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని హైద‌రాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టులో ప్రవీణ్ దాఖలు చేసిన పిటీషన్ లో తాను రాజకీయ నేతల పేర్లు బయట పెట్టానని తప్పుడు ప్రచారం జరుగుతోందని,దీంతో తన కుటుంబానికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో పాటుగా తన ఇంటి వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ప్రవీణ్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. తనతో పాటుగా తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని ఇప్పటికే పోలీసులను కోరినట్లు వివరించారు. కానీ, పోలీసుల నుంచి స్పందన రాలేదన్నారు.