హాలీవుడ్ సినిమాలను చూసే ఉంటారు. ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. పాత సినిమాల్లో రష్యా విలన్. ఇప్పుడు చైనా విలన్. లేదంటే.. ముస్లిం దేశాలు. ఇంకా అవసరమైతే వెనిజులా, మెక్సికో, లిబియా. ఇక ఉత్తరకొరియా, ఇరాన్, ఇరాక్, సిరియా గురించి చెప్పక్కర్లేదు. ఈ లిస్టు పెద్దగానే ఉంటుంది. అవి రోగ్ స్టేట్స్ అంటూ.. ఆ దేశాల ప్రజలందరూ ఉగ్రవాదులకు మద్దుత ఇస్తారన్న రేంజిలో సినిమాలు ఉంటాయి. వాళ్లంతా కూడబలుక్కొని అమెరికాపై యుద్ధానికి వస్తారు. సుసంపన్న అత్యంత ప్రజాస్వామ్య దేశమైన అమెరికాను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా కుట్రలు కుతంత్రాలు చేస్తారు. కానీ.. అమెరికా మాత్రం మొక్కవోని అకుంఠిత దీక్షతో… పటిష్టమైన గూఢచారి యంత్రాంగం సీఐఏ, ఎన్ వైపీడీ, స్వాట్ సహాయంతో దేశభక్తియుతమైన అమెరికన్లు వాటిని తుత్తునియలు చేస్తుంటారు. నరాలు తెగిపోయే ఉత్కంఠతో కథనాలు నడుస్తుంటాయి. ఫైటింగులు.. చేజింగులు.. దేశాధ్యక్షుల సంభాషణలు.. మిలిటరీ వ్యూహాలు..అబ్బో అబ్బో..
బాలీవుడ్ సినిమాలు కూడా ఇందుకు మినహాయింపేమి కాదు. అయితే పాకిస్తాన్. లేదంటే టెర్రరిస్టులు. మధ్యలో కశ్మీర్ అన్నట్లుగా సాగుతుంటాయి. ఇందుకు మంచి ఉదాహరణ “ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్ ఇందులో కథ అంతా పాకిస్తాన్, కశ్మీర్, ఉగ్రవాదులు, శ్రీలంక తమిళ ఈలం.. ఇలా వారిచుట్టూనే తిరుగుతుంది. పైగా.. దక్షిణాది వారి తిండిని కూడా ఎగతాళి చేసే సన్నివేశాలు కూడా ఉంటాయి. సినిమాను సినిమాగా చూస్తే పర్లేదు. కానీ.. వాటిని ఓన్ చేసుకుంటేనే అసలు సమస్య.
తన శత్రుదేశాలపై తమ దేశ ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక భావనను రేకెత్తించేందుకు..పగతో రగిలిపోయేలా చేసేందుకు.. తాము చేసే యుద్ధానికి ప్రజలు మద్దతు పలికేలా.. వారిని మానసికంగా సంసిద్ధం చేసే వ్యూహంలో భాగంగా ఇలాంటి సినిమాలు తీసేలా అమెరికా ప్రోత్సహించిందన్నది సుస్పష్టం. కుక్కను చంపాలంటే ముందుగా ఆ కుక్కపై పిచ్చిదనే ముద్రవేయాలనే సూత్రం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే రష్యా, చైనా, వియత్నాం, ఉత్తరకొరియా వంటి సినిమాలు లెక్కకు మిక్కిలి వచ్చాయి. తనను ఎదిరించే వెనిజులా డ్రగ్స్ దేశంగా చూపించగలిగాయి. ప్రజలల్లో ఆ భావనను నాటగలిగాయి.
మరి మన దేశంలోనూ ఇలాంటి ట్రెండ్ మొదలయ్యిందా? మొదలయ్యిందనే అంటున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “ఆదిపురుష్”పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను బీజేపీ తన ఎజెండాలో భాగంగా తెరకెక్కించిన మూవీ అని కన్నెర్ర జేశారు. యూరీ- ది సర్జికల్ స్ట్రైక్స్, కశ్మీర్ ఫైల్స్ తరహాలో “ఆదిపురుష్” కూడా రూపొందిందని ఆరోపించారు. ఇలా మరో 16 సినిమాలను తెరకెక్కిస్తోందని చెప్పారు.
వచ్చేఏడాది తెలంగాణలో ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున..ఆ సమయంలో ఈ సినిమాను విడుదల చేస్తారని, తద్వారా రాముడి సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టాలని బీజేపీ భావిస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. రామరాజ్యం అంటే బీజేపీ ప్రభుత్వమనే భావను ప్రజల మెదళ్లలోకి జొప్పించేందుకు ఈ సినిమాను తీశారని మండిపడ్డారు.
ఈ ఆరోపణల్లో నిజమెంతో అబద్ధమెంతో కాలం తేలుస్తుంది. కానీ..ఇలా మన దేశంలో ఓ సినిమాపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి రావడం గమనార్హం. మిగతా సినిమాలపై ఈ తరహా ఆరోపణలు వచ్చినా.. అవి విడుదలైన తర్వాతే వచ్చాయి. కానీ.. విడుదలకు ముందే ఈ ఆరోపణలు రావడం ఒకింత సంచలనమే. మరి కేటీఆర్ వ్యాఖ్యలపై హీరో ప్రభాస్ ఏమంటారో వేచి చూడాలి. సినిమా టీం ఎలా స్పందిస్తోందనని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.