హుజూరాబాద్లో రౌండ్ రౌండ్ కి బీజేపీ పార్టీకి ఆధిక్యత పెరుగుతోంది. మొదటి ఆరు రౌండ్లలో టీఆర్ఎస్ పార్టీకి 3186 ఓట్ల ఆధిక్యతలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ఎక్కువ ఆశలు పెట్టుకున్న హుజూరాబాద్ మండలంలో ప్రజలు బీజేపీనే ఆదరించారు. అయితే 7 నుంచి 9 రౌండ్లలో కౌంటింగ్ టీఆర్ఎస్ పార్టీకి కీలకంగా మారబోతోంది. ఈ రౌండ్లలో కీలకమైన వీణవంక మండలం ఉంది ప్రస్తుతం టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌషిక్ రెడ్డి ఇద్దరు నేతల సొంత మండలం కూడా వీణవంకనే. దీంతో వీణవంక మండలంపై టీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది.
ఈ మండలంలో టీఆర్ఎస్ పార్టీకి లీడ్ లభిస్తే ఈటెల రాజేందర్ ఆధిక్యతను తగ్గించే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. వీణవంక మండలంలో ఎన్నికల సమయంలో 35623 ఓట్లు పోలయ్యాయి. అయితే ఈ మండలంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం టీఆర్ఎస్ పార్టీకి లాభిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. కౌషిక్ రెడ్డి, రెడ్డి సామాజికవర్గం కావడం, ఈ మండలంలో గణనీయంగా వారి ప్రభావం ఉండటంతో పార్టీకి ఆధిక్యత వస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది.