లాజిక్‌లతో ‘కారు’కు పంక్చర్లు చేస్తున్న ఈటల…

హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కే‌సి‌ఆర్, అనేక రకాలుగా రాజకీయాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఒకటి అని కాదు చాలా రకాలుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టాలని కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు తన మంది బలాన్ని మొత్తం హుజూరాబాద్‌లో దించేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు…ఇతర నాయకులు హుజూరాబాద్‌లో మకాం వేసి టి‌ఆర్‌ఎస్‌ని గెలిపించాలని తిరుగుతున్నారు.

etela
etela/హుజూరాబాద్‌

ఇటు మంత్రి హరీష్…టి‌ఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని వెంటపెట్టుకుని హుజూరాబాద్‌లో గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఇక హుజూరాబాద్ ప్రజలని ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులని టి‌ఆర్‌ఎస్‌లోకి తీసుకొస్తున్నారు. పదవుల పంపకాల్లో హుజూరాబాద్ నాయకులకు పెద్ద పీఠ వేస్తున్నారు. అసలు హుజూరాబాద్ ప్రజలకు ఏ సమస్య ఉన్న క్షణాల్లో పరిష్కారం అయ్యేలా చూసుకుంటున్నారు.

అయితే ఇదంతా ఎవరి వల్ల జరుగుతుందంటే…అది కేవలం ఈటల రాజేందర్ వల్లే అని అందరికీ అర్ధమవుతుంది. ఆ విషయం హుజూరాబాద్ ప్రజలు కూడా అర్ధం చేసుకుంటున్నారు. ఇదే అంశాన్ని ఈటల లాజికల్‌గా చెబుతున్నారు. మామూలుగా టి‌ఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు హుజూరాబాద్‌లో ప్రచారానికి వచ్చి ఈటలపై విమర్శలు చేస్తున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేస్తున్నారు.

కానీ ఇదే నాయకులు…వారి సొంత నియోజకవర్గాల్లో ఏ మేర అభివృద్ధి చేశారో చెప్పాలని ఈటల అడుగుతున్నారు. అలాగే హుజూరాబాద్ ప్రజలకు కే‌సి‌ఆర్ ప్రభుత్వం ఏం చేసినా అది కేవలం తాను రాజీనామా చేయడం వల్లే జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. అంటే హుజూరాబాద్‌కు కే‌సి‌ఆర్ ఏం చేసినా అది ఈటల ఖాతాలోకే పోయేలా కనిపిస్తోంది. అసలు ఈటల రాజీనామా చేయకపోతే ఈ స్థాయిలో పనులు జరిగేవి కాదని హుజూరాబాద్ ప్రజలు కూడా గట్టిగానే నమ్ముతున్నారు. కాబట్టి టి‌ఆర్‌ఎస్ ఎంత చేస్తే, అంత ఎక్కువగా ఈటలకు లబ్ది చేకూరనుంది.