హుజూరాబాద్ ఓటర్లు తమ చైతన్యాన్ని చాటుకున్నారు. రికార్డ్ స్థాయిలో ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారు. గతం లో కన్నా అధికంగా పోలింగ్ పర్సెంటేజీ నమోదైంది. సాయంత్ర 7 గంటల వరకు 86.4 శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు ఓటర్లు క్యూలోనే ఉన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి మరింతగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఒకటి నుంచి రెండు శాతం మేర పోలింగ్ పెరిగే అవకాశం ఉంది.
కాగా పెరిగిన ఓటింగ్ శాతం ఎవరి కొంప ముంచుతుందో అని రాజకీయ పార్టీలు కలవర పడుతున్నాయి. అయితే పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలంగా ఉందని అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పార్టీలు భావిస్తున్నారు. సాధారణంగా ఉప ఎన్నికల సమయంలో ఓటేసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించరు..కానీ హుజూరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటర్లు ఓటేసేందుకు బారులు తీరారు. సహజంగా పార్టీల పట్ల వ్యక్తుల పట్ల అసంత్రుప్తి ఉన్న సమయంలో, ప్రత్యేక పరిస్థితుల్లో ఓటింగ్ శాతం పెరుగుతుంది. పెరిగిన ఓట్లు ఎవరికి లాభిస్తాయో.. ఎవరికి నష్టం కలిగిస్తాయో తెలియాలంటే నవంబర్ 2 తేదీ వరకు ఆగాల్సిందే.