హైదరాబాద్ మహా నగరంలో భీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని అమీర్ పేట, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, మణికొండ ఇంకా చాలా చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. దీంతో.. హైదరాబాద్ నగరంమంతా.. జలమయమైంది. అయితే.. హైదరాబాద్‌లో నిత్యం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజలకు సూచించారు.
ముఖ్యంగా హైదరాబాద్‌లో నేటి రాత్రి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ నివేదికల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరి అవసరాలపై తప్ప ఇంట్లోంచి బయటికి వెళ్ళ వద్దని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు విజ్ఞప్తిచేశారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తిన పక్షంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ 040-21111111 ను సంప్రదించాలని హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి కోరారు.