చింతకాయలతో ఫేమస్ అయిన హైదరాబాద్ మహిళ..! ఏం చేసిందంటే..

-

ఒకప్పుడు ఇళ్లుంటే చాలు అనుకునే వాళ్లు.. కానీ ఇప్పుడు ఇంటి నిర్మాణం అంటే.. అణువు అణువు అందంగా ఉండాలని అందరూ అనుకుంటున్నారు. ఇంటీరియర్ డిజైన్, ఫర్నీచర్ కోసం స్పెషల్గా కొందరిని పెట్టుకుని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఈరోజుల్లో ఇలాంటి డిజైనర్స్ కు గిరాకీ బాగా ఉంది. అయితే.. వందలో మనమూ ఒకటి అయితే.. ఈ టాపిక్ అనవసరం.. కానీ ఆమె వేరు. నూతన విధానంతో వినూత్నంగా ఆలోచించింది. ఇంటీరియర్ డిజైన్ అంటే.. కేవలం అందంగా తీర్చిదిద్దడమే కాదు.. వాటికి ప్రాణం పోసి..ఆ డిజైన్ ను అద్భుతంగా మారుస్తుంది. జీవం ఉందా అన్నట్లు అనిపిస్తుంది ఆమె చేసే డిజైన్లు చూస్తే..!
ప్రియాంక నరుల(Priyanka Narula). పుట్టి పెరిగింది కాన్పూర్‌లో. స్థిరపడింది మాత్రం మన హైదరాబాద్‌లోనే. ఇంజినీరింగ్ చేసిన ఆమెకు ఇంటీరియర్ డిజైన్‌పై ఇంట్రెస్ట్ ఉండేది.‌. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న డిజైన్లును చెక్ చేసింది. వాటిలో క్రియేటివిటీ ఉంది గానీ ఎక్కడో సోల్ మిస్సవుతుందన్న భావన ఆమెలో కలిగింది. ఇలా ఆలోచిస్తున్న టైంలో ఆమె మెదడులో వచ్చిన ఆలోచనే కేన్‌ అల్లికలు. ఎలాంటి టెక్నాలజీ లేని టైంలోనే భిన్న డిజైన్లతో వెదురుబుట్టలు అల్లేవాళ్లు కదా..ఇప్పుడు వాళ్లకు కాస్త ప్రోత్సాహమిస్తే ప్రపంచమే ఇటువైపు చూస్తుందని భావించి ఆ దిశగా అడుగలు వేసింది.
అలా స్టడీ చేయగా ప్రియాంక మైండ్‌ నుంచి వచ్చిన ఆలోచనే ది విక్కర్ స్టోరీ. కేన్‌ సన్నగా ఉంటుంది. ఎలాంటి డిజైన్స్‌ చేయాలన్నా దానికి అనుగుణంగా మారే స్వభావం ఉంది. అందుకే వెదురు నారతో కొత్త చరిత్ర సృష్టించారు ప్రియాంక. ఎలాంటి వ్యర్థాలు లేకుండా వందకు వందశాతం కేన్‌ మెటీరియల్‌ వాడుకోవచ్చట. ఎలాంటి కృత్రిమ మెటీరియల్ వాడకుండా సహజ సిద్ధమైన వాటితోనే ఈ ఫర్మిచర్ తయారు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. రవాణాకు చాలా సౌకర్యవంతంగా ఉండే ఈ ఫర్మిచర్ ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు. అందుకే గ్లోబల్‌గా ఈమె డిజైన్లు చాలా ఫేమస్ అయ్యాయి.
ఈ రంగంలో నైపుణ్యం కలిగిన వర్కర్స్ ఉన్నప్పటికీ వాళ్లను ఆధునీకరించేవాళ్లు లేకపోవడంతోనే ఈ వృత్తి అంతరించిపోయే స్థితికి వచ్చిందని ఆమె గ్రహించారు. అందుకే సంప్రదాయబద్దమైన అల్లికలకు ఆధునికత జోడించారు. అలా తీసుకొచ్చిన డిజైన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ వచ్చింది.
ఇలా సంప్రదాయమైన అల్లికలకు త్రీడీ టెక్నాలజీ జోడించి తీసుకొచ్చిన మొదటి ఉత్పత్తి పేరు ఇమ్లీ. అంటే చింతకాయ మాదిరిగా ఉండే ఓ విధమైన డిజైన్ తీసుకొచ్చారు. చూడటానికి చాలా అందగా కనిపించే ఈ డిజైన్‌ హాట్ కేక్స్‌లా అమ్ముడు పోయింది. ఇమ్మీ డిజైన్‌ ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని వైవిధ్యమైన డిజైన్లకు ఊతమిచ్చింది. ఇలా లోకల్‌గా మన చుట్టూ ఉన్న కొన్ని వస్తువుల నుంచి డిజైన్లు రూపొందించి అంతర్జాతీయ ఐకాన్ అయ్యారు మన ప్రియాంక. లిఫాఫా ఛైర్‌, బ్లూమ్ బెంచ్‌, కోరల్ ల్యాంప్‌ ఇలాంటివన్నీ ఇమ్లీ తయారీతో వచ్చిన ఐడియాలే.
ఇలాంటి ఉత్పత్తులు దేశంలో ఎవరైనా కొంటారా, అమ్ముడు పోతాయా లేదో అని మొదట చాలా టెన్షన్ పడిందట..ఏడాదిన్నర అలానే సాగింది. దేశ వ్యాప్తంగా చాలా వేదికలపై తమ ప్రోడెక్ట్ స్పెషాలిటీ వివరించారు ప్రియాంక. 2019 వరకు ఇదే పని చేశారు. 2020 ఓ అంతర్జాతీయ కంపెనీ ఇచ్చిన అవార్డుతో విక్కర్‌ స్టోరీ కథ మారింది.
లాక్‌డౌన్‌ టైంలో చాలా రకాల డిజైన్లు చూశామని, వాటికి దీటుగా సరికొత్త డిజైన్లు ప్లాన్ చేసినట్టు ప్రియాంక తెలిపారు.. ఈ టైంలోనే తమ ప్రోడెక్ట్స్‌కి కూడా గుర్తింపు వచ్చిందట. ఇక్కడ పని చేస్తున్న వాళ్లంతా హైదరాబాద్‌లోని పాతబస్తీ నుంచి వచ్చిన వాళ్లే. పూర్వ కాలంలో మన పూర్వీకులు ఉపయోగించే వస్తువుల మాదిరిగా నేటి తరానికి ఉపయోగపడే డిజైన్లు తయారు చేయడం వీళ్లలోని నైపుణ్యం.
డిమాండ్ పెరుగుతున్న కొద్దీ తమ వస్తువుల ధర కూడా తగ్గుతుందట.. మొదట తయారు చేసిన ఇమ్లీ డిజైన 42 వేలకు విక్రయిస్తే… తర్వాత తయారు చేసిన ప్రోడెక్ట్స్‌ ధర 18వేల రూపాయలకు మించలేదు. ప్రస్తుతం వంద మంది క్లైంట్స్‌కు కేన్ ఉత్పత్తులు అమ్ముతున్నారు ప్రియాంక. యూకే నుంచి ఆర్డర్స్ వస్తున్నాయట. ఇలా పని పాతదే అయినా.. కొత్తగా చేస్తే విజయం సాధించవచ్చని ప్రియాంక మరోసారి నిరూపించారు. ఇదొక్కటే కాదు.. నేడు ఎన్నో సంప్రదాయ వృత్తులు టెక్నాలజీ లేక మరుగుపడిపోతున్నాయి. ఆ వృత్తులకు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు.!

Read more RELATED
Recommended to you

Latest news