తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు వచ్చేసింది. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలతో ఈ ఉప ఎన్నిక ప్రచార గడువు ముగుస్తుంది. ప్రచారంలో చివరి అంకంలో టీఆర్ఎస్ బీజేపీ హోరాహోరీగా తలపడగా.. కాంగ్రెస్ వెనకపడినట్టే కనిపించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కంటే మంత్రి హరీష్‌రావు, ఆ పార్టీ అగ్రనేతలు ఇక్కడ మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత కేవలం నామమాత్రమే. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు పార్టీ నేతల సహాకారం ఉన్నా ఇక్కడ ఆయన మాత్రమే హైలెట్ అయ్యారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు నుంచే ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ దూసుకుపోయారు.
ఈ ఎన్నికలు అందరికన్నా మంత్రి హరీష్‌రావుకే సవాల్‌గా మారనున్నాయి. అందుకే ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఉప ఎన్నికను తీసుకున్నారు. గతంలో ఇదే జిల్లాలో నారాయణ్‌ఖేడ్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని హరీష్‌రావు భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే ఇప్పుడు దుబ్బాకలో ఆ పరిస్థితి లేదు. టీఆర్ఎస్‌కు సానుకూలత ఉందనుకుంటున్నా వార్ ఖచ్చితంగా వన్ సైడ్ కాదు. ఎన్నికలకు ముందు భారీ మెజార్టీ అనుకున్న టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఓ మోస్తరు మెజార్టీతో గెలుస్తాం అంటున్నారు.
దీనిని బట్టి ఇక్కడ బీజేపీ నుంచి ఎంత గట్టి పోటీ ఉందో తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్‌ను వదిలేసి పదే పదే బీజేపీని, ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావును టార్గెట్ చేస్తోంది. రేపు ఇక్కడ టీఆర్ఎస్‌కు ఊహించని పరాజయం ఎదురుతై ఆ పరాజయం హరీష్‌రావు ఖాతాలో వేసేస్తారు. హరీష్ సొంత జిల్లా, ఆయన పక్కన నియోజకవర్గం, టీఆర్ఎస్ కంచుకోటలో ఓటమా ? అన్న ప్రశ్నలు ఆయన ఎదుర్కోవాలి. ఒకవేళ టీఆర్ఎస్ అత్తెసరు మెజార్టీతో గెలిచినా హరీష్‌రావుకు ఇబ్బందులు తప్పవు.
రేపటి వేళ ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగే క్రమంలో సొంత జిల్లాలోనే పట్టు తగ్గుతోందా ? అంటూ సొంత పార్టీ నేతలే ప్రశ్నలు సంధిస్తారు. మొన్న లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌లో టీఆర్ఎస్ ఓడి, మెదక్‌లో భారీ మెజార్టీతో గెలవడం కేటీఆర్‌కు మైనస్ అయ్యింది. ఇప్పుడు దుబ్బాకలో మెజార్టీ తగ్గినా హరీష్ కేంద్రంగా అనేక చర్చలు సొంత పార్టీలోనే ఉంటాయి. ఏదేమైనా గత ఎన్నికల కంటే భారీ మెజార్టీ వస్తేనే హరీష్‌పై చర్చకు అవకాశం ఉండదు. మరి దుబ్బాక ఓటరు తీర్పు ఎలా ఉంటుందో ? చూడాలి.