ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే కాంగ్రెస్ సర్కార్ కాలగర్భంలోనికే వెళ్తుందని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ కీలక నేతల ఈటల రాజేందర్ అన్నారు. ప్రజల విశ్వాసాలతో చెలగాటడం సరికాదని హితవు పలికారు. కొందరు హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం మీద దాడి చేశారని, నిందితులను ఈ ప్రాంత ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించి రోజులు గడిచినా స్థానికుల మనోభావాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరించిదన్నారు.
ఈ క్రమంలోనే బుధవారం కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అహంకారపూరితంగా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం కూడా కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం ఇటువంటి దాడులు రాష్ట్రంలో జరగకుండా చూసుకోవాలని సూచించారు.