ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో కొందరు యువకులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్ వద్ద కొందరు యువకుల మధ్య వాగ్వాదం నెలకొంది.అనంతరం ఇరువురు బ్లేడ్లతో దాడులకు యత్నించారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఆ యువకులను అడ్డుకునేందుకు యత్నించిన ఓ మహిళ సైతం కిందపడిపోగా గాయాలు అయినట్లు సమాచారం. ఫాస్ట్ఫుడ్ సెంటర్ బండి వద్ద ఇరువురికి ఏదో ఒక విషయంలో గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది. అది కాస్త పెద్దది కావడంతో ఇరువర్గాలు బ్లేడ్లతో దాడులకు పాల్పడ్డారు.యువకులు ఒక్కసారిగా గందరగోళం సృష్టించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.అనంతరం వారిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.