ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును జగన్ సర్కార్ మార్చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై వైసిపి మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చటానికి ఆయన తప్పుపట్టారు. ఓ మహానీయుడు పేరు మార్చి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చిందని, ఇది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, అందరికీ చెందిన మహా నాయకుడు అన్నారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చడం బాధ కలిగించింది అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో మాట్లాడిన ఆయన కీలకమైన కామెంట్స్ చేశారు. అమరావతి రాష్ట్రభివృద్ధికి చిహ్నమని, ఇందులో వివాదం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. అమరావతిలో రైతులు రుపాయి తీసుకోకుండా రాజధాని కోసం 32 వేల ఎకరాలు ఇచ్చిన ఘనత ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.