నెతన్యాహుతో అజిత్‌ డొభాల్‌ భేటీ.. గాజాలో యుద్ధంపై చర్చ

-

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌ సోమవారం రోజున ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుతో సమావేశమయ్యారు. హమాస్‌పై గాజాలో జరుగుతున్న యుద్ధం గురించి ఆయనతో డొభాల్ చర్చించారు. బందీల విడుదల, మానవతా సాయం అందజేత వంటి అంశాలూ ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. డొభాల్‌తో భేటీ, చర్చించిన అంశాలను నెతన్యాహు కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

అంతకుముందు నెతన్యాహు మాట్లాడుతూ.. అక్టోబర్‌ 7 తరహాలో హమాస్‌ మళ్లీ ఇజ్రాయెల్‌పై దాడి చేసే ప్రమాదం ఉండొద్దని అన్నారు. ఆ లక్ష్యంతోనే యుద్ధం కొనసాగిస్తున్నామని పునరుద్ఘాటించారు. ‘హమాస్‌ ఉగ్రవాద ఆర్మీ’ని సమూలంగా నాశనం చేస్తామని స్పష్టం చేశారు. అందులో భాగంగా రఫాలోనూ సైనిక చర్య ఉంటుందని వెల్లడించారు. మరో రెండు నెలల పాటు యుద్ధం కొనసాగుతుందని చెప్పిన నెతన్యాహు కచ్చితమైన సమయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరోవైపు గాజాపై పోరులో ఇజ్రాయెల్‌ అనుసరిస్తున్న విధానాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తప్పుబట్టడంపైనా నెతన్యాహు స్పందిస్తూ ఇజ్రాయెలీల అభీష్టానికి విరుద్ధంగా తాను సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్లు భావిస్తే అది పొరపాటని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version