హమాస్‌ను ఉగ్ర సంస్థగా గుర్తించాలని భారత్‌ను ఇజ్రాయెల్ దేశం కోరింది. ఇందుకు సంబంధించి విస్తృత సమాచారాన్ని భారత్‌కు అందించే పనిలో నిమగ్నమయ్యామని.. భారత్ తప్పకుండా హమాస్‌ను ఉగ్ర సంస్థగా గుర్తింస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే దీనిని 40 దేశాలు ఉగ్రసంస్థగా గుర్తించాయని వెల్లడించింది. భారత్-ఇజ్రాయెల్‌ల మధ్య దౌత్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో అనే విషయాన్ని తాజా సంక్షోభం రుజువు చేసిందని ఇజ్రాయెల్ చెబుతూనే.. గాజాకు మానవతా సహాయాన్ని అందించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.
హమాస్‌కు సంబంధించిన సమాచారాన్నిచాలా క్రమపద్ధతిలో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు అందిస్తున్నామని భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ తెలిపారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాతోపాటు ఐరోపా సమాఖ్య దేశాలు వంటి 40 దేశాలు హమాస్‌ను ఇప్పటికే ఉగ్రసంస్థగా ప్రకటించాయని.. మిత్రదేశాలన్నీ అలానే గుర్తించాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య పోరు కొనసాగుతున్న వేళ.. తాజా పరిణామాలపై పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నవోర్ ఈ వ్యాఖ్యలు చేశారు.