ఇమ్రాన్ ఖాన్ చుట్టూ బిగిస్తోన్న ఉచ్చు… త్వరలోనే అరెస్ట్..!

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల తన పదవిని కోల్పోవడం తెలిసిందే. అవిశ్వాస తీర్మాణం నుంచి తప్పించుకుందాం అని చివరి వరకు పోరాడినా.. పాక్ సుప్రీం కోర్ట్ ఆదేశాలతో అవిశ్వాస తీర్మాణంతో పదవిని కోల్పోయాడు. కొత్తగా ప్రతిపక్షాలు మద్దతుతో షహబాజ్  షరీఫ్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యాడు. పాక్ గత చరిత్రను చూస్తే పదవి కోల్పోయిన ప్రధాని అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు అరెస్ట్ చేయబడ్డారు. ఇమ్రాన్ ఖాన్ కు కూడా ఇది తప్పడం లేదు.

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏ క్షణమైన ఆయన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. నిధులు దుర్వినియోగం చేశారంటూ… ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోదు అయింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ సౌదీ అరెబియాలో ఈద్ ప్రార్థనల్లో ఉండగా… అది ముగియగానే ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. మరో వైపు ఇమ్రాన్ ఖాన్ పై దైవదూషన కేసు కూడా నమోదైంది. ఇటీవల సౌదీలోని మదీనా పర్యటనల్లో ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను  దొంగ.. దొంగ అంటూ నినాదాలు చేశారు.