పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మాణాన్ని తోసిపుచ్చడంతో ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించాయి. ఈ వివాదాన్ని పాక్ సుప్రీం కోర్ట్ సుమోటోగా స్వీకరించింది. తాజాగా ఈ వివాదంపై పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. స్పీకర్ అవిశ్వాస తీర్మాణాన్ని తిరస్కరించడం సరికాదని వ్యాఖ్యానించింది. డిప్యూటీ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు చెప్పింది. జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఇక తప్పని పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కోవాల్సిందే. ఎల్లుండి అవిశ్వాసంపై పాక్ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరగనుంది.
ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మైనారిటీలో పడటం తెలిసిందే. అనేక రాజకీయ పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ తన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని పాక్ అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీకి సిఫారసు చేశారు. దీంతో పాక్ అధ్యక్షుడు కూడా ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఈ అంశం పాక్ సుప్రీం కోర్ట్ కి చేరింది. దీంతో తాజాగా పాక్ సుప్రీం కోర్ట్ ఈరోజు తీర్పు చెప్పింది.