కరోనా మహమ్మారి.. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ వైరస్ నుంచి ఇప్పటికీ కొన్ని దేశాలు ఆర్థికంగా కోలుకోలేదు. మరికొన్ని తీరని నష్టాల్లో కూరుకుపోయాయి. లక్షల మందిని ఈ మహమ్మారి పొట్టన బెట్టుకుంది. మరిన్ని లక్షల మందిని తమ ఆత్మీయులకు దూరం చేసింది. ఎంతోమందికి దీర్ఘకాలిక వ్యాధులను అంటించి పోయింది. ఈ వైరస్ సోకి తగ్గిన కొందరు ఇప్పటికీ పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఇక గత కొంతకాలం నుంచి కరోనా భయం నుంచి బయటపడి సాఫీగా జీవనం సాగిపోతోంది. ఈ క్రమంలో తాజాగా కరోనాపై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కొన్నివారాలుగా 84 దేశాల్లో తీవ్రత కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తీవ్రత ఎక్కువ ఉండే వేరియంట్లు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘కొవిడ్ ఇంకా మనతోనే ఉంది’ అన్ని దేశాల్లో వ్యాపిస్తోందన్న డాక్టర్ మరియా ఖర్కోవ్ అన్నారు. ఈ క్రమంలో ప్రజలు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.