ఏపీ నేత‌ల‌కు ఈ ఆశ‌లు కూడా క‌రోనాలో క‌లిసిపోయాయ్…!

-

క‌రోనా మ‌హ‌మ్మారి.. ప్ర‌జ‌ల ప్రాణాలు తీయ‌డ‌మే కాదు.. రాజ‌కీయ నేత‌ల జీవితాల‌తోనూ ఆడుకుంటోందా?  వారి ఆశ‌ల ఊసుల ను భ‌గ్నం చేస్తోందా?  వారికి అగ‌మ్య గోచ‌రాన్ని సృష్టిస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీ విష‌యానికి వ‌స్తే.. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం, అదికార ప‌క్షం రాజ‌కీయంగా అనేక ఆశ‌లు పెట్టుకుంది. ఇక‌, నాయ‌కులు కూడా ఎన్నో ఆశ‌ల నిచ్చెన‌లు పేర్చుకున్నారు. అయితే, అవ‌న్నీ కూడా క‌రోనా ఎఫెక్ట్‌తో కూలిపోతున్నాయి. నిజానికి ఈ ఏడాది చివ‌ర‌లో కానీ, వ‌చ్చే ఏడాది ఆరంభంలోకానీ, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ఉంటుందని అంద‌రూ అనుకున్నారు. త‌ద్వారా రాష్ట్రంలో ఇప్పుడున్న 175 నియోజ‌క‌వ‌ర్గాలు 225కు చేరుతాయ‌ని అనుకున్నారు.


నిజానికి ఈ ఆశ‌ల‌తోనే ప‌లువురు పార్టీలు మారారు. కొత్త‌గా రాజ‌కీయాల్లోకి కూడా వ‌చ్చారు. అయితే,ఇప్పుడు క‌రోనా కాటుతో ప్ర‌భుత్వాలు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశాన్ని అట‌కెక్కిస్తున్నాయ‌ని తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల విభ‌జ‌న అనేది కేంద్రం ప‌రిధిలోని అంశం. అయిన‌ప్ప‌టికీ.. 2023నాటికి నియోజ‌క‌వ‌ర్గాలు విభ‌జిస్తామ‌ని, ముందు జ‌నాభా లెక్క‌లు తీయాల్సి ఉంటుంద ని కేంద్రం నిన్న మొన్న‌టి వ‌ర‌కు చెప్పింది. అయితే, ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా.. అన్ని ప‌నులు నిలిచిపోయాయి. ము ఖ్యంగా జ‌నాభా గ‌ణన‌ను మ‌రో రెండేళ్ల‌పాటు వాయిదా వేస్తున్నారు.

వ‌చ్చే ఏడాది చివ‌రి వ‌ర‌కు కూడా క‌రోనా ఎఫెక్ట్ నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి రావ‌డం, జ‌నాభా లెక్క‌ల నిధుల‌కు గండి ఏర్ప‌డ‌డంతో ఈ అంచ‌నాలు లెక్క‌లు దాటుతున్నాయి. ఫ‌లితంగా నియోజ‌క‌వ‌ర్గాల విభ‌జ‌న అంశం దాదాపు ఇప్ప‌ట్లో అంటే రెండేళ్ల త‌ర్వాత కూడా చేప‌ట్టే అవ‌కాశం లేదు. ఇక‌, అప్ప‌టికి మ‌ళ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు నిధులు స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది. అదేస‌మ‌యంలో క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా దెబ్బ‌తిన్న ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను కూడా ప‌ట్టాలెక్కించాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ అయ్యే స‌రికి పుణ్య‌కాలం గ‌డిచిపోతుంది. అంటే.. ఇప్ప‌టికిప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అనేది చేప‌ట్టేందుకు అవ‌కాశం లేద‌ని కేంద్రమే చెబుతున్న మాట‌.

రాష్ట్రంలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంటుంది. నియోజ‌క‌వ‌ర్గాల‌ను విభ‌జిస్తే..రాష్ట్ర వాటా కింద కొంత మేర‌కునిధులు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు కేటాయించాలి. అయితే, ఇప్పుడు రాష్ట్ర ప్రాధాన్యాల్లో ఆమేర‌కు నిధులు వెచ్చించే ప‌రిస్థితి ఉండ‌దు. సో.. మొత్తానికి ఈ నియోజ‌క‌వ‌ర్గాల విభ‌జ‌న అనేది ఇప్ప‌ట్లో తేలే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుండ‌డంతో నేత‌లు నీళ్లున‌మ‌లుతున్నారు. మ‌రి చూడాలివీరి ఆశ‌లు ఎప్ప‌టికి నెర‌వేరేనో!!

Read more RELATED
Recommended to you

Latest news