ఏపీ ప్రభుత్వాధినేత వైఎస్ జగన్ సింపతీ కోల్పోయారా? లేన జగన్ ప్రభుత్వం బాగా డబ్బున్న ప్రభుత్వ మనేలా ప్రచారం చేసుకున్న కారణంగా అందరూ దూరమయ్యారా? ఇప్పుడు ఈ విషయంపైనే అనేక మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం.. ఇటీవల చోటు చేసుకున్న వాయుగుండం, అల్పపీడనాల కారణంగా.. ఏపీలోని దాదాపు ఆరు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. వీటిలో మూడు జిల్లాల్లోని వందల గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. ప్రజలు పొట్ట చేతపట్టుకుని రోడ్డెక్కారు.
మరీ ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీకావు. గ్రామాలకు గ్రామాలే వరదలో చిక్కుకున్నాయి. కరెంటు వ్యవస్త నిలిచిపోయింది. అయితే, ఈ సమయంలో ప్రజలను ఆదుకునేందుకు జగన్ సర్కారు తక్షణ సాయంగా ప్రతి ఒక్కరికీ 500 చొప్పున ఇచ్చారు. ఇక, వరద ప్రబావిత ప్రాంతాల్లోని వారికి నిత్యావసరాలు.. ఇతర సాయం అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. అదేసమయంలో వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను తిరిగి నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సర్కారు వారి తరఫున ప్రయత్నం బాగానే ఉంది.
కానీ, ఇతర సామాజిక వర్గాలు కానీ, తెలుగు సినీ పరిశ్రమ కానీ.. ఈ విపత్తు సమయంలో ఏపీకి సాయం చేసేందుకు మాత్రం ముందుకు రాకపోవడం గమనార్హం. రాష్ట్రానికి ఈ వర్షాల కారణంగా సుమారు 4450 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని సీఎం జగన్ స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు విడదల చేయాలని కూడా అభ్యర్థించారు. ఇంత విపత్కర పరిస్తితిలో తెలుగు సినీమా పరిశ్రమ పెద్దలు ఏమయ్యారు? అదేసమయంలో పారిశ్రామిక వర్గాలు ఏమయ్యాయా? అనేది ప్రధానంగా తెరమీదికి వచ్చిన కీలక ప్రశ్న.
పొరుగు రాష్ట్రంలో అడగకుండానే కోట్లకు కోట్టు సాయం చేస్తున్న వారు ఏపీ విషయానికి వస్తే.. ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరూ ఇవ్వలేదు. అయితే, దీని వెనుక.. జగన్ చేసుకున్న కారణమే ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రజలకు వివిధ పథకాల కింద వేల కోట్లు పంచుతుండడంతో ఏపీ ప్రభుత్వం దగ్గర బాగానే సొమ్ములున్నాయనే అభిప్రాయం కలుగుతోందని అందుకే సింపతీ కూడా రావడం లేదని అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామం ఆసక్తిగా ఉండడం గమనార్హం.