ముఖ్యంగా ఉద్యోగి జీవితానికి సంబంధించి ఎంతో ఆసరాగా నిలిచే, సామాజిక మరియు ఆర్థిక భద్రతలు అందించే పింఛను విషయమై ఆయన ఎటూ తేల్చలేకపోతున్నారు.ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా విన్నారు. అధికారంలోకి రాగానే వారంలోగానే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఆ మాట మాత్రం ఇప్పటికీ అమలు నోచుకోలేదు. ఇదే విషయమై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఆ రోజు తమకు ఇన్ని ఆర్థిక పర అంశాలపై అవగాహన లేకుండా పోయిందని ఒప్పుకున్నారు. సీపీఎస్ రద్దుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కానీ నిన్నటి వేళ సీపీఎస్ బదులు గ్యారంటీ పెన్షన్ స్కీం పేరిట ఓ ఆర్థిక విధానం అమలు చేస్తామని చెబుతున్నారు. ఇది కూడా ఉద్యోగులను గందరగోళానికి గురి చేస్తోంది. సీపీఎస్ పేరును మార్చి జీపీఎస్ గా చేసినంత మాత్రాన తమ సమస్యలు పరిష్కారం కావని ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ల అసోసియేషన్ పేర్కొంటోంది.
ఇక ఓల్డ్ పెన్షన్ స్కీంకు, సీపీఎస్ కు మధ్య ఉన్న ఆర్థిక భేదం .. లేదా ప్రయోజనాల్లో వచ్చే తేడా భర్తీకి ఎప్పటి నుంచో ఓ గ్రాంట్ ను విడుదల చేస్తే బాగుంటుందని ఇదే ఈ సమస్యకు పరిష్కారం అని టక్కర్ (అప్పటి సీఎస్ , పదవీ విరమణ తరువాత ఆయన ఇచ్చిన రిపోర్టు అనుసారం) చెప్పారు. ఇదే మాట మిగతా అధికారిక వర్గాలూ చెబుతున్నాయి. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఏడాది రెండు వేల కోట్లకు పైగా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేస్తున్నారు. ఓ ప్రభుత్వం అనుకుంటే ఈ పాటి మొత్తాన్ని ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదనే అంటోంది. కానీ సీఎం జగన్ ఇందుకు ససేమీరా అంటున్నారు. ఇది కూడా తమకు ఆర్థిక భారమే అని చెప్పలేక చెప్పలేక చెబుతున్నారు. ఓ విధంగా గారడి చేస్తున్నారే తప్ప స్పష్టత ఇవ్వడం లేదు. సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా అయితే రాజ్యాంగ స్ఫూర్తి అనిచెబుతున్నారో అదే విధంగా జీవించే హక్కు కు సంబంధించిన పింఛను అమలు కూడా రాజ్యాంగ స్ఫూర్తిలో భాగం ఎందుకు కాదు అని , ఒకవేళ సీపీఎస్ ను కొనసాగిస్తే అది కూడా ఓ విధంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని దీనిపై తాము త్వరలో కోర్టుకు వెళ్తామని ఉద్యోగ సంఘాల కీలక నాయకులు మరియు ప్రతినిధులు చెబుతున్నారు.