ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. వాటి పరిష్కారాలు చాలా వరకూ కేంద్రం పరిధిలో ఉన్నాయి.. విభజన చట్టంలోని హామీలు గురించి అడిగిన పాపాన పోలేదు.. హస్తిన పెద్దలు స్పందించిన పాపానా పోలేదు. ఇదే క్రమంలో ప్రైవేటు పరం అయిపోతున్న “ఆంధ్రుల హక్కు” గురించి కాస్త గట్టిగా మాట్లాడిన పరిస్థితి లేదు. సరే… అన్నీ ఒకేసారి మాట్లాడతారేమో అని ఫిక్సయిన ఏపీ వాసులకు నిరాశే ఎదురైంది.
అవును… హస్తిన యాత్ర అంటే అత్యుత్సాహం చూపిస్తూ.. తమకు కావాల్సిన అన్ని విషయాలూ అడిగిమరీ తెచ్చుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ విషయంలో జగన్ ఇప్పటివరకూ హస్తిన వెళ్లి అడిగిన దాఖలాలు ఈమధ్యకాలంలో లేవు. అయితే అనుకోకుండా ఆ ఛాన్స్ వచ్చింది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరగనున్న సమావేశానికి జగన్ వెళ్లాలి. కానీ.. ఆ టూర్ క్యాన్సిల్ అయ్యింది!
ఈ రోజు ఉదయం జగన్ నడుస్తుండగా కాలుకు ప్రమాదం జరగడంతో ఆయన ఆకస్మికంగా ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే వ్యాయామం చేసేఅలవాటున్న ఏపీ సీఎం… డైలీ దినచర్యలో భాగంగా ఈ రోజు వ్యాయామం చేస్తోంటే కాలు బెణికింది. దీంతో… ఆయనను పరీక్షించిన వైద్యులు.. కొద్ది రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో… ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరితతో పాటు హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు ఢిల్లీ మీటింగ్ కు హాజరు అవుతున్నారు.
జగన్ కాలే అడ్డురాకపోయిఉంటే… ఏపీలో ఉన్న లెక్కలేనన్ని సమస్యలు – రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు అవుతున్నా కేంద్రం వద్ద ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న హామీల పై ఏపీవాసులకు ఒక క్లారిటీ వచ్చేది. కానీ… ఆ అవకాశం లేకుండా పోయింది. మళ్లీ జగన్ హస్తిన వెళ్లేది ఎప్పుడు.. ఏపీ సమస్యలపై ప్రస్థావించేది ఎప్పుడు.. అవి ఏపీకి కేంద్రం ఇచ్చేది ఎప్పుడు..? హతవిధీ – ఎంతపనిచేశావే కాలా??