అవరావతి: ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ కేలండర్‌ను వ్యతిరేకిస్తూ జననేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజాము నుంచే ఆందోళనకు సిద్ధంకావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జనసేన నేతలను ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. తాడేపల్లిలో సీఎం జగన్ ఇంటి ముట్టడిస్తారనే నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా జనసేన నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, జనసేన నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అయితే ఈ అరెస్ట్‌లను జనసేన పార్టీ ఖండించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను జాబ్ కేలండర్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఎంప్లాయిమెంట్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. జాబ్ కేలండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు మద్దతుగా జనసేన పోరాటం చేస్తోందని ఆ పార్టీలు వర్గాలు వెల్లడించాయి. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని గత ఎన్నికల్లో వైసీపీ చెప్పి నిరోద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.