వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తూ ఏపీ అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రవేశపెట్టడం, వెనువెంటనే ఆ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై జనసేన అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. ఆయా సంస్థలకు పెట్టిన పేర్లను మార్చి ఏం సాధిస్తారు? అంటూ ఆయన ప్రశ్నించారు. ఆయా సంస్థల పేర్ల మార్పిడితో వివాదాలను సృష్టించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందంటూ ఆరోపించారు పవన్ కల్యాణ్. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ బుధవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు పవన్ కల్యాణ్. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పిడికి గల సహేతుక కారణాన్ని వైసీపీ సర్కారు వెల్లడించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ పేరు స్థానంలో వైఎస్సార్ పేరు వస్తే.,.. వర్సిటీలో వసతులు మెరుగు అవుతాయా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఆశించిన మేర వసతులు లేవని అన్నారు. కరోనా సమయంలో కేవలం మాస్కులు అడిగినందుకే డాక్టర్ సుధాకర్‌ను వేధింపులకు గురి చేసి ఆయన మరణానికి కారణమయ్యారని పవన్ ఆరోపించారు.
మెరుగు పరచాల్సిన మౌలిక వసతులను పక్కనపెట్టి… ఆయా సంస్థల పేర్లను మార్చుకుంటూ వెళుతున్న వైసీపీ సర్కారు… ప్రజల దృష్టిని సమస్యలపై నుంచి మళ్లించేందుకే యత్నిస్తోందని ఆరోపించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్ ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒరకైన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు మన పాలకుల్లో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. వైద్య విశ్వవిద్యాలయానికి ఆ రంగంలోని ప్రముఖుల పేర్లు పెట్టాలన్న సంకల్పం ఉండి ఉంటే… ఎల్లాప్రగడ పేరు పెట్టి ఉండేవారన్నారు పవన్ కల్యాణ్. బోదకాలు, టైఫాయిడ్ వంటి రోగాలకు మందులు కనిపెట్టి ప్రపంచానికి అందించిన గొప్ప శాస్త్రవేత్తగా ఎల్లాప్రగడను కీర్తించారు పవన్ కల్యాణ్.