ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతినిత్యం ఏదో ఒక సంచలనాత్మక నిర్ణయంతో గతంలో ఎవ్వరూ చేయని, అలాంటి ఆలోచనే చేయని విధానాలను అవలంభిస్తూ దూసుకుపోతున్నారు. “నవరత్నాలు” అంటూ ప్రజల చెంతకే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం తీసుకెళ్లారు. “గ్రామ సచివాలయాలు” ఏర్పాటు చేసి ప్రతి సామాన్యుడికి ఎలాంటి ఆటంకం కలగకుండా వెంటనే తమ ఊర్లోనే సమస్యలను పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇదో సంచలనంగా చెప్పవచ్చు. ఇదే క్రమంలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు.
తాజాగా జేసీ ట్రావెల్స్ అక్రమాల కేసులో 54రోజుల పాటు జైల్లో గడిపి బయటకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి “జగన్ సంచలన నిర్ణయం” ఒకటి బయటపెట్టారు. జేసీ కుటుంబాన్ని ఏ ఒక్క రాజకీయ నాయకుడు జైల్లో వేయలేదని… ఆ ఘనత దక్కించుకున్న యువ సీఎం జగన్ అని, గతంలో ఎన్టీఆర్ కూడా తమను 11రోజుల పాటు జైల్లో పెట్టారని గుర్తు చేసుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతటితో ఆగకుండా అధికారం ఉంటే ఎవరినైనా జైల్లో పెట్ట వచ్చని.. అందుకు తగిన కారణాలు ఏం అక్కరలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఎన్టీఆర్ పేరు తెచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. జగన్ పేరు కూడా రావడంతో వైసీపీ శ్రేణులు మురిసిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళామణులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో “మద్యపాన నిషేదం” జరిపి ఏపీ మహిళామణుల ఆదరాభిమానాలు చూరగొన్నారు ఎన్టీఆర్. అదేస్థాయిలో ఇప్పుడు వైఎస్ జగన్ కూడా విడల వారీగా మద్యపాన నిషేదం విషయంలో చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ ను వైఎస్ జగన్ వారసత్వంగా తీసుకున్నారు అనేడి ఆడపడుచుల మాటగా ఉంది. ఇదే సమయంలో ఎన్టీఆర్ అసలు సిసలు అభిమానులు కూడా ఈ విషయంలో మురిసిపోతున్నారు.
“ఆరోగ్యశ్రీ”వంటి వినూత్న ఆలోచనలతో ప్రజాసంక్షేమాన్ని కాంక్షించిన “వైఎస్ఆర్ వారసుడిగా” వైఎస్ జగన్ పేరుతెచ్చుకోవడమే కాకుండా.. ఇప్పుడు “ఎన్టీఆర్ వారసుడిగా” మద్యపానాన్ని ఏపీలో లేకుండా చేయడం అందుకు తగిన అడుగులు చాలా వేగంగా పడటంతో ప్రజలు వేనోళ్ల కొనియాడుతున్నారు. మరోవైపు అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించిన జగన్.. ఆ దిశగా వినూత్నంగా దూసుకుపోతూ సామాన్యుడి మనస్సు దోచుకుంటున్నారని అంటున్నారు.
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే… అప్పడు మద్యపానం విషయంలో మహిళలు “ఎన్టీఆర్ -జగన్” పేరు చెప్పారు. ఇప్పుడు జైలుకెళ్లి వచ్చిన వారు కూడా “ఎన్టీఆర్- జగన్” పోలికలను ప్రస్తావిస్తూ… జగన్ క్రెడిట్ పెంచేస్తున్నారు. దీంతో వైఎస్ఆర్ కే కాకుండా.. ఎన్టీఆర్ కి కూడా వారసుడిగా వైఎస్ జగన్ అయిపోయారు అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.