తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని మరోసారి ఉద్ఘాటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తాజాగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చే జాబితాలో తెలంగాణ కూడా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతమవుతోందని అన్నారు జేపీ నడ్డా. రాష్ట్రపార్టీ నాయకత్వం చేపట్టిన కార్యక్రమాలు, పోరాటాలు ప్రశంసనీయమని అన్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాలను సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి డీకే అరుణ, ఎంపీ క్ష్మణ్, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు. సోమవారం ప్రారంభమైన సమావేశాలు మంగళవారంతో ముగియనున్నాయి. రానున్న ఎన్నికల్లో అనుసంరించాల్సిన వ్యూహాలు, బూత్ స్థాయిలో పటిష్ఠం, వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై తొలిరోజు చర్చించారు.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి నివేదిక సమర్పించారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన లభిస్తోందని, వివిధ వర్గాల ప్రజల తరలివచ్చి తమ సమస్యలు విన్నవించుకుంటున్నారని వివరించారు. ప్రజల ఆదరణ చూసి తట్టుకోలేక యాత్రను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ అనేక ప్రయత్నాల చేసిందని వెల్లడించారు. పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆంక్షలు విధిస్తోందని, అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని తెలిపారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ పోరాడిన విధానాన్ని వివరించారు.