భారతదేశంలో జూన్ 25 ను బ్లాక్ డేగా ప్రకటించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని రాఘవపూర్ బచ్చాయిపల్లిలో భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించిన రఘునందన్ రావు.. పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
గతంలో ఇందిరాగాంధీ ప్రతిపక్షాలను ఎలాగైతే అణచివేతకు ప్రయత్నాలు చేసిందో.. ఎలాగైతే ప్రజాస్వామ్యం గొంతునులిమి నియంత పాలన సాగించాలని కోరుకుందో.. నేడు తెలంగాణ రాష్ట్రంలో అదే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో నేడు నిర్బంధాలు, ఒత్తిల్లు పోలీసు పాలన తప్ప మరేమీ లేదన్నారు. ఇందిరాగాంధీ హయాంలో 21 నెలల ఎమర్జెన్సీని పారద్రోలి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని అన్నారు. తెలంగాణ లో ఎమర్జెన్సీ విధించే పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు కూడా తిరిగే హక్కు లేకుండా పోయింది అని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన.. వీరి దుర్మార్గపు పాలన ఇంకా ఎంతో కాలం కొనసాగదని పేర్కొన్నారు.