కేఏ పాల్..ఒకప్పుడు ఈ పేరు బాగా ఫేమస్..కానీ ఇప్పుడు ఆ పేరు వింటేనే పెద్ద కామెడీగా ఉంటుంది. ఒకప్పుడు పాల్ ఏ విధంగా అనేక దేశాలు తిరిగి ప్రవచనాలు చెప్పారో అందరికీ తెలిసిందే…అలాగే అనేకమంది దేశాధినేతలతో పాల్ కు పరిచయాలు ఉన్నాయి. ఇక అలాంటి పాల్..ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద కమెడియన్ అయ్యారు. మరి ఆయనే అలా అయిపోయారా? లేక ఎవరైనా అలా చేసేశారా? అనేది తెలియదు గాని…మొత్తానికి ఇప్పుడు రాజకీయాల్లో పాల్ అంటే ఓ కమెడియన్ అయ్యారు.
అయినా సరే పాల్ ఏ మాత్రం తగ్గకుండా రాజకీయం నడిపించాలనే చూస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రజాశాంతి పేరిట పార్టీ నడిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే గత ఎన్నికల్లో ఆయన ఏపీలో పోటీ చేశారు. ఇక ఆయన పార్టీ ఒక్క చోట కూడా డిపాజిట్ తెచ్చుకోలేదు. అలాగే నరసాపురంలో పోటీ చేసి పాల్ కూడా డిపాజిట్ తెచ్చుకోలేకపోయారు. అలా ఏపీలో ఫెయిల్ అయిన పాల్..తర్వాత అమెరికాకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ ఇచ్చి బాగా హాట్ టాపిక్ అవుతున్నారు.
ఈ మధ్య పాల్ ఎక్కువగా తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు…అసలు ఆయన ఏ స్థాయిలో కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారో తెలిసిందే..అలాగే ఆయనపై దాడి కూడా జరిగిన విషయం తెలిసిందే..అలాగే ఆయన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాని సైతం కలిశారు. షాని కలిసొచ్చాక..పాల్ మరింతగా కేసీఆర్ ప్రభుత్వంపై ఎటాక్ చేస్తున్నారు. కేసీఆర్ ని గద్దె దించుతానని అంటున్నారు.
అసలు రాజకీయంగా ఏ మాత్రం బలం లేని పాల్…కేసీఆర్ ని ఎలా గద్దె దించుతారని, మళ్ళీ ఆయన కమెడియన్ అవుతారని అంతా అనుకుంటున్నారు. అయితే పాల్ పరోక్షంగా బీజేపీకి హెల్ప్ చేస్తున్నారని, బీజేపీ కోసమే రంగంలోకి దిగారని, ఎన్నికల్లో ఎన్నోకొన్ని ఓట్లు చీల్చి బీజేపీకి లబ్ది చేకూర్చేలా ప్లాన్ చేశారని అంటున్నారు. 2019 ఏపీ ఎన్నికల్లో చాలా చోట్ల ప్రజాశాంతి , వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్ధులు పేర్లు ఒకేలా ఉన్న విషయం తెలిసిందే. అంటే వైసీపీని దెబ్బకొట్టడానికి పాల్ ని బరిలో దించారని అర్ధమవుతుంది. కానీ అప్పుడు అది వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ఫార్ములాతో రంగంలోకి దిగి…టీఆర్ఎస్ ని దెబ్బకొట్టనున్నారని విశ్లేషణలు వస్తున్నాయి. కాబట్టి పాల్ ని కామెడీగా తీసుకోవద్దని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.