ఏపీ బీజేపీని నడిపిస్తున్నది సోము వీర్రాజు కాదా? కేంద్రంలోని పెద్దలేనిత్యం ఓ కన్ను ఏపీ బీజేపీ నేతలపై వేసి ఉంచుతున్నారా? అంటే.. ఔననే అంటున్నాయి ఢిల్లీ బీజేపీ వర్గాలు. కీలకమైన ఏపీలో వచ్చే ఎన్నికల్లో పార్టీని అదికారంలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ పెద్దలు శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేనతోనూ ఢిల్లీలో పెద్దలు పొత్తు పెట్టుకున్నారు. దీంతో ఏపీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న సోముకు రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. అయితే, ఆయన పదవి చేపట్టిన దగ్గ ర నుంచి ప్రభుత్వాన్ని కాకుండా ప్రతిపక్షాలను టార్గెట్ చేయడంపై ఢిల్లీ వరకు ఫిర్యాదులు వెళ్లాయి.
పైగా మహిళా నేతలకు ప్రాధాన్యం లేకుండా చేయడంపైనా ఫిర్యాదులు అందినట్టు ఢిల్లీలోనే ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే.. పార్టీ తరఫున వాయిస్ వినిపించే నాయకులే లేకుండా పోతున్న సమయంలో.. ఉన్న ఓ నలుగురిని కూడా సోము కట్టడి చేస్తున్నారని, ఆంక్షల పేరుతో ఆయన నేతల నోళ్లకు తాళం వేస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఇటీవల కాలంలో పెద్దగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కారణంగా చాలా మంది నేతలను సోము సస్పెండ్ చేయించారు. దీంతో ఆయా విషయాలపై ఢిల్లీ పెద్దలు తీవ్రంగానే ఆలోచిస్తున్నారని అంటున్నారు. ప్రతి విషయాన్నీ.. ఇక్కడ నుంచి తెప్పించుకుంటున్నారని.. పార్టీలోనే ఢిల్లీ పెద్దలకు వార్తలు మోసేవారు ఒకరు ఉన్నారని తెలుస్తోంది.
ఇక, ఇదేసమయంలో ఇటీవల రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌కు చెందిన ఓ మహిళా నాయకురాలి చీరపై చేసిన కామెంట్లపై అదే సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నాయకురాలు.. ఢిల్లీ పెద్దలకు పిర్యాదు చేయడం మరింత వివాదంగా మారింది. ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీకి డ్యామేజీగా మారతాయని.. రేపు ప్రజల్లోకి ఎలా వెళ్తామని ఆమె ప్రశ్నించారట. పార్టీ వాయిస్ వినిపిస్తున్న చిన్నస్థాయి వారిపై చర్యలు తీసుకుంటున్న సోము.. విష్ణు విషయంలో మాత్రం మౌనం వహించారని ఆమె పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలే.. ఏపీ బీజేపీని నియంత్రించాలని భావిస్తున్నట్టు ప్రచారంలో ఉంది.
ఇదిలావుంటే.. సోము వీర్రాజు.. రెండేళ్లు కూడా ఆపదవిలో ఉండే ఛాన్స్ లేదని.. ఏడాదిలోనే ఆయన మూటముల్లె సర్దు కోవడం ఖాయమని,.. కన్నా లక్ష్మీనారాయణ లాగా మాట్లాడడం చేతకావడం లేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారి.. మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి ఈ విషయాలు బీజేపీలో చాలా ఆసక్తికరంగా చర్చకు వస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.