తప్పు చేసింది ఎవరైనా సరే.. శిక్ష పడాల్సిందే. ఈ ఘటనే దానికి నిదర్శనం. కన్నడ సీనియర్ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. కట్నం కోసం వదినను వేధించిన కేసులో అభినయను దోషిగా తేల్చిన కోర్టు 2 ఏళ్లు జైలు శిక్ష విధించగా, ఆమె సోదరుడు శ్రీనివాస్‌కు మూడు సంవత్సరాలు, ఆమె తల్లి జయమ్మకు ఐదేళ్లు, మరో సోదరుడు చెలువరాజుకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 1998లో శ్రీనివాస్-లక్ష్మీదేవి వివాహం జరిగింది. ఆ సమయంలో లాంఛనాల రూపంలో రూ. 80 వేల నగదు, 250 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నారు. అయితే, ఆ తర్వాతి నుంచి లక్ష్మీదేవిపై వేధింపులు మొదలయ్యాయి. అదనంగా మరో లక్ష రూపాయల కట్నం తీసుకురావాలంటూ అభినయ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె 2002లో చంద్రా లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెళ్లయిన ఆరు నెలల నుంచే అత్తింటివారు తనను వేధించడం మొదలుపెట్టారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. అత్తింట్లో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. అభినయ అప్పట్లో హీరోయిన్ కావడంతో ఇంటికి ఎవరెవరో వచ్చేవారని, వారికి సహకరించాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చే వారని ఆరోపించారు.
అయితే, లక్ష్మీదేవి ఆరోపణలకు సంబంధించిన కేసును బెంగళూరు నగర జిల్లా న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఆ తీర్పును సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా, ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం అభినయ, శ్రీనివాస్, జయమ్మ, చెలువరాజును దోషులుగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌బీ ప్రభాకరశాస్త్రి నిన్న తీర్పు వెలువరించారు. హైకోర్టు తీర్పుపై లక్ష్మీదేవి హర్షం వ్యక్తం చేశారు.