తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం కంటి వెలుగు. తెలంగాణ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కంటి వెలుగు పథకాన్ని మళ్లీ ప్రారంభించేందకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్రంలోని అందరికీ కంటి పరీక్షలు నిర్వహించిన సర్కారు.. అవసరమైన వాళ్లందరికీ ఉచితంగా కళ్ల అద్దాలు, కంటి ఆపరేషన్లు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆ ప్రకటన మాత్రం నిర్దేశించిన ఐదు నెలల్లో పూర్తిగా అమలు కాలేకపోయింది. కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇచ్చిన సర్కారు.. ఆపరేషన్లు మాత్రం పూర్తిగా నిర్వహించలేకపోయింది. అయితే.. ఇప్పటికే అమలవుతోన్న పలు పథకాలతో పాటు.. కంటి వెలుగు పథకాన్ని కూడా మరోమారు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. అన్నీ జిల్లాల అధికారులకు పథకం అమలుకు సంబంధించిన దిశానిర్దేశంతో పాటు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై ఆదేశాలు కూడా సీఎం కేసీఆర్ ఇచ్చినట్టు సమాచారం.
కంటి వెలుగు పథకాన్ని 2018లో ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు ఖర్చు చేసింది కూడా. అయితే.. పథకంలో భాగంగా కళ్లద్దాలతో పాటు మందులు కూడా పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఆపరేషన్లు మాత్రం పూర్తి స్థాయిలో చేయలేకపోయిందన్న వాదన ప్రజల నుంచి వినిపించింది. ఇప్పటికి కూడా.. తెలంగాణలోని జిల్లాల్లో కంటి సమస్యలతో సతమతమవుతున్న వాళ్ల భారీగానే ఉంది. చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు. కళ్లద్దాలతో పాటు కంటి ఆపరేషన్‌ల కోసం క్యూ కడుతున్నట్టు వైద్య శాఖకు రిపోర్టు వచ్చాయి.