తెలంగాణలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బస్సులోనే ఆయన ఆహారాన్ని స్వీకరించారు. షెడ్యూల్ బిజీగా ఉండటంతో సమయం వృథా కాకుండా ఆయన హెలిప్యాడ్ వద్ద బస్సులోనే భోంచేశారు. పులిహోర, పెరుగన్నం, అరటిపండును ఆయన తిన్నారు. బస్సులో ఉన్న నేతలకు, అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పులిహోరను వడ్డించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తో పాటు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, మరో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ సంతోష్, పలువురు నేతలు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, సెక్రెటరీ టు సీఎం స్మితా సబర్వాల్ తదితరులు ఉన్నారు.
మరోవైపు ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని చెప్పారు. నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందని తెలిపారు. పంట నష్టపోయిన రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలే తప్ప… నారాజ్ కారాదని ఆయన వెల్లడించారు.