కేటీఆర్ కి సీఎం పదవి పై కేసీఆర్ అందుకే వెనక్కి తగ్గారా

-

తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఇప్పట్లో ఉండదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. కేటీఆర్ ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. తాను రాజీనామా చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఇంకోసారి మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతానన్నారు. ఎక్కడైనా లూస్ టాక్ చేస్తే బండకేసి కొట్టి పార్టీ నుంచి బయట పారేస్తానన్నారు. కేసీఆర్ ఈ స్థాయిలో పార్టీ నేతల పై ఎందుకు మండిపడ్డారు..కేటీఆర్ కి సీఎం పదవి పై కేసీఆర్ వెనక్కి తగ్గారా అన్న చర్చ ఇప్పుడు గుళాబీ పార్టీ శ్రేణుల్లో నడుస్తుంది.

సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ కాస్త ఘాటుగానే క్లాస్ పీకారు. ఇంకో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ ప్రకటించారు. కేటీఆర్ సీఎం అంటూ ప్రచారం పతాకస్థాయికి చేరిన వేళ కేసీఆర్ వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి.తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ కాస్త క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది. సీఎం సొంత ఇలాకాలో జరిగిన ఉప ఎన్నికలో అది కూడా సిట్టింగ్ ను కోల్పోవడం ఆపై గ్రేటర్ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ కావడం టీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని కాస్త కలవరానికి గురి చేసింది.

ఆ నేపథ్యంలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక రానుంది. ఈ ఎన్నికలు టీఆర్ఎస్ భవిష్యత్ కు అత్యంత కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పు ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఎన్నిక అధికార పార్టీకి పెద్ద సవాల్. రాష్ట్రంలో దూకుడు మీదున్న బీజేపీని అడ్డుకోవడంతో పాటు బలమైన నేత జానారెడ్డిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అందుకే ముందు నాగార్జున సాగర్ పై ఫోకస్ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు.

టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరిగింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా రివర్స్ అయ్యాయి. తన నైజానికి భిన్నంగా కొన్ని పథకాలను క్యాన్సిల్ చేశారు కేసీఆర్. పీఆర్సీ ప్రకటించకపోవడంతో ఉద్యోగులు, ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో యువత రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తే… పాలన చేతకాక కేసీఆర్ పారిపోయారని విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉందన్న వాదన కూడా కొందరు గులాబీ నేతల నుంచి వస్తుందట.

పోరాడి తెలంగాణ సాధించిన ఉద్యమ నేతగా , రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ కు.. ఈ తరహా ప్రచారం ఇబ్బందిగా మారుతుందని వారు చెబుతున్నారట. అందుకే కేటీఆర్ ను సీఎం చేయాలన్న అంశంపై కేసీఆర్ కాస్త వెనక్కి తగ్గారా అన్న చర్చ నడుస్తుంది. మరో వైపు నిఘా వర్గాల నివేదికలు కూడా కారణమని తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. టీఆర్ఎస్ చీలిపోయే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయని చెబుతున్నారు.

పైకి అంతా సఖ్యతగా కనిపిస్తున్న అగ్రనాయకత్వం నుంచి జిల్లా స్థాయి వరకు ఆదిపత్యపోరు తీవ్రస్థాయిలో నడుస్తుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ రెండు వర్గాలుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న నేతలంతా హరీష్ రావు కోటరిలో ఉండగా.. బంగారు తెలంగాణ అంటు హడావిడి చేసే లీడర్లంతా కేటీఆర్ వెంట ఉన్నారనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే… ఉద్యమ నేతలంతా తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందన్న చర్చ ఊపందుకుంది.

ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచింది బీజేపీ. ఇతర పార్టీల నేతలకు వల వేస్తోంది. కారు పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కమలం నేతలు. ఇలాంటి సమయంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి.. పార్టీలో అసమ్మతి పెరిగేలా చూసుకోవడం మంచిది కాదనే భావనకు టీఆర్ఎస్ అధినేత వచ్చారంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news