అరే.. ప‌రేషాన్ కాకు.. దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు

-

రాజ‌కీయంగా ఎత్తులు వేయ‌డంలో గండ‌ర‌గండ‌డిగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు త‌న మెద‌డుకు మ‌రింత ప‌దును పెడుతున్నారు. ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న దూకుడు పెంచారు. భవిష్య‌త్తులో ఏ ఎన్నిక జ‌రిగిన టీఆర్ ఎస్‌కు ఎదురులేకుండా చేయ‌డానికి వ్యూహం ప‌న్నుతున్నారు. తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీ బ‌ల‌ప‌డుతుండ‌టంతో కేసీఆర్ కొంత ఆలోచ‌న చేయాల్సి వ‌చ్చింది. గ‌తంలో తాను తీసుకున్న నిర్ణ‌యాలే ఆ పార్టీ బ‌లోపేతానికి కార‌ణ‌మ‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పుడు అటువంటి త‌ప్పు చేయ‌కుండా మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

పోర‌డు.. గ‌త్త‌ర గ‌త్త‌ర చేస్తుండు..

తెలంగాణ‌లో కాంగ్రెస్ ను భూస్థాపితం చేసి ప్ర‌తిప‌క్షం లేకుండా తెలంగాణ రాష్ట్ర స‌మితిని బ‌లోపేతం చేద్దామ‌నుక‌న్న స‌మ‌యంలో ల‌క్ష్యం నెర‌వేరినా అనుకోకుండా మ‌రోవైపు నుంచి ప్ర‌మాదం ముంచుకొచ్చింది. ప్ర‌తిప‌క్షం లేకుండా చేయ‌డం ఎంత త‌ప్పో అవ‌గ‌త‌మైంది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌మాద‌క‌ర‌మ‌నుకుంటే అంత‌క‌న్నా ప్ర‌మాద‌క‌ర‌మైన భార‌తీయ జ‌న‌తాపార్టీ వ‌చ్చి ఆ స్థానంలో నిల‌బ‌డింది. కేంద్రంలో అధికారంలో ఉండ‌టం కూడా ఆపార్టీకి క‌లిసివ‌చ్చే అంశ‌మ‌వుతోంది. దుబ్బాక ఎన్నిక‌ల్లో సానుభూతి అంశం ప‌నిచేయ‌క‌పోగా ప‌రాజ‌యం ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. టీఆర్ఎస్‌కు పెట్ట‌నికోట లాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఓట్ల చివ‌రి లెక్కింపు వ‌ర‌కు నువ్వా? నేనా? అనేరీతిలో జ‌రిగిన స‌మ‌యంలో విజ‌యం బీజేపీనే వ‌రించింది. దీంతోపాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మెజార్టీ స్థానాల‌ను గెలుచుకోవ‌డం కూడా కేసీఆర్‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది.

కాంగ్రెస్‌ను పెకిలించిన త‌ర్వాత‌..

కాంగ్రెస్ పార్టీని తెలంగాణ‌లో కూక‌టివేళ్ల‌తో స‌హా పెక‌లిస్తే త‌ర్వాత బీజేపీ సంగ‌తి చూడొచ్చు అనే ఆలోచ‌న చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియ‌ర్లు కూడా వేర్వేరు పార్టీల్లోకి వ‌ల‌సెళ్లుతుండ‌టంతో కేసీఆర్ ప‌ని ఇంకా సులువ‌వుతోంది. ప్ర‌జ‌లు కూడా ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ ను కాద‌ని బీజేపీవైపు చూస్తున్నారు. వీట‌న్నింటినీ ప‌సిగ‌ట్టిన కేసీఆర్ త‌న వ్యూహాల‌ను మారుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంగ్లిషు గ‌డ్డిలాంటిద‌ని, ఎక్క‌డ వేసినా మొలుస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తారు. ఈ విష‌యం కేసీఆర్‌కు తెలియ‌నిదేంకాదు.

అందుకే అందులో భాగ‌మే పీవీ న‌ర‌సింహారావు భ‌జ‌న కార్య‌క్ర‌మం. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పీవీ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను రాష్ట్ర పండుగ‌లా నిర్వ‌హిస్తున్నారు. ప‌లు జిల్లాల్లో, హైద‌రాబాద్ సెటిల‌ర్ల‌లో కాంగ్రెస్‌కు సంస్థాగ‌తంగా ఉన్న‌ ఓటు బ్యాంకును త‌న‌వైపున‌కు తిప్పుకొనేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. శాసనమండలి సభ్యులురాలిగా ఎన్నికైన వాణీదేవిని మండ‌లి చైర్మన్ చేయ‌డంతోపాటు పీవీ కుమారుడు ప్రభాకర్‌రావుకు నామినేటేడ్ ప‌ద‌వినిచ్చి గౌర‌వించాల‌ని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ రెండు ప‌నులు పూర్తిచేసిన త‌ర్వాత స‌రికొత్త వ్యూహానికి త‌మ అధినేత తెర‌తీస్తార‌ని తెలంగాణ రాష్ట్ర‌స‌మితి వ‌ర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news