రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నంబర్ వన్ అని నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొన్నదని, విరోధులు ఇకనైనా విషప్రచారాన్ని వీడాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని నైట్ ఫ్రాంక్ అనే సంస్థ నివేదిక శుక్రవారం వెల్లడించింది.
తాజాగా ఈ నివేదికపై సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన చామల కిరణ్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో కంటే కాంగ్రెస్ పాలనలో స్థిరాస్తి వ్యాపారం దూసుకుపోతోందని నైట్ ‘ఫ్రాంక్’గా కుండ బద్దలు కొట్టిందని, అన్ “రాక్ సాలిడ్”గా తేల్చేసిందన్నారు. ఇకనైనా దుష్మన్లు తమ దుష్ఫ్రచారం బంద్ చేయండి అని బీఆర్ఎస్ పార్టీతో పాటు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నేత హరీష్ రావును చామల కిరణ్ ట్యాగ్ చేశారు. ఆయన ట్వీట్‌ను కాంగ్రెస్ నేతలు రీట్వీట్ చేస్తున్నారు.