Dhanush Birthday: కోలీవుడ్​ టు హాలీవుడ్​… ధనుష్​ సినిమాలకే ఉన్న ఆ స్పెషల్​ ఏంటంటే?

-

చూడగానే ఆకట్టుకునే రంగు అతనికి లేదు. ఆకర్షించే కటౌట్‌ అతనిది కాదు. అసలు నటనంటే ఏంటో తెలీదు. పైగా చాలా సిగ్గు. అతడు స్టార్‌ హీరో అవుతాడని ఎవరైనా ఊహిస్తారా? కానీ ఇప్పుడతడు నేటి తమిళ స్టార్‌ హీరో ధనుష్‌. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్​ను సంపాదించుకున్నాడు. ‘వై దిస్‌ కొలవెరి!’ పాటతో ‘అబ్బో మామూలోడు కాదు’ అనిపించుకున్నాడు. ‘రఘువరన్‌ బీటెక్‌’తో మనలో ఒకడై పోయాడు. ఈ మధ్యే జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకి రెండోసారి ఎంపికై తన స్థాయేమిటో మళ్లీ నిరూపించాడు. నేడు అతడి పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలను తెలుసుకుందాం…

అందరూ దర్శకులే.. ధనుష్‌ అసలు పేరు వెంకటేశ్‌ ప్రభు కస్తూరి రాజా. 1983 జులై 28న మద్రాసులో జన్మించారు. ధనుష్‌కి ఇద్దరు సోదరీమణులు, ఒక అన్నయ్య ఉన్నారు. ‘7జీ బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ చిత్రాల దర్శకుడు సెల్వ రాఘవనే ధనుష్‌ సోదరుడు. తన తండ్రి, తన సోదరుడు, తన భార్య, తన భార్య సోదరి దర్శకత్వంలో నటించారు ధనుష్​. ఒకే కుటుంబంలో ఇంతమంది దర్శకులు ఉండటం ఒక విశేషం అయితే. అందరితోనూ పనిచేయడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం.

అలా నటుడిగా.. ధనుష్​ తండ్రి.. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసి తర్వాత దర్శకుడయ్యారు. నిర్మాత, సంగీత దర్శకుడిగానూ కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలోని నటన అంటే ఇష్టం లేని తన కొడుకు ధనుష్​ను బలవంతంగా ‘తుల్లువదో ఇలమై’ చిత్రంతో పరిచయం చేశారు. 2002 మే 10న ప్రేక్షకుల ముందుకొచ్చిందా చిత్రం. అసలు కథ అప్పుడే మొదలైంది. సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది.

నటుడే కాదు.. ధనుష్‌ నటుడు మాత్రమే కాదు. ఆయనలో దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గేయ రచయిత, కథా రచయిత ఉన్నారు. కెరీర్‌ ప్రారంభంలో ఆయన రాసి, ఆలపించిన ‘వై దిస్‌ కొలవెరి’ ప్రపంచాన్ని ఎంతగా ఊపిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఐదు నిమిషాల్లో ఆ పాటను రాశాడు ధనుష్‌. అయితే ధనుష్​ సినిమాలకు ఓ స్పెషాలిటీ ఉంది. చాలా వరకు ఆయన నటించిన సినిమాల్లోని పాటలు శ్రోతలను విపరీతంగా ఉర్రూతలూగిస్తాయి. సోషల్​మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్​ను దక్కించుకుంటాయి. 3-వై దిస్​ కొలవరీ, మారి- డాను డాను, మారి తారా లోకల్​, మారి 2- రౌడీ బేబీ, ఎనయ్​ నోకి పాయుమ్​ తోటా- మరువార్తాయ్ ​, పటాస్​- చిల్ బ్రో, జగమేతంతిరమ్​-రకిట రకిట, అనేగమ్​-దంగ మారి ఊధారి చాలా మిలియన్​ వ్యూస్​ను సొంతం చేసుకున్నాయి. ఇలాంటి ఘనత మిగతా హీరోలకు తక్కువనే చెప్పాలి.

కోలీవుడ్​ టు హాలీవుడ్​.. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌, హాలీవుడ్‌, టాలీవుడ్‌లోనూ అభిమానుల్ని సంపాదించుకున్నారాయన. ‘రంజనా’ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి ‘షబితాబ్‌’తో ప్రశంసలు అందుకున్నారు. ఇటీవలే అక్షయ్​కుమార్​తో ‘అత్రాంగి రే’లో నటించారు. ‘ది ఎక్ట్స్రార్డనరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ ఆయన నటించిన తొలి ఆంగ్ల చిత్రం. రీసెంట్​గా ‘ది గ్రేమ్​ మ్యాన్’​ చిత్రంతో అభిమానులను పలకరించారు. పలు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు వారికి పరిచయమైన ధనుష్‌ ‘రఘువరన్‌ బీటెక్‌’ చిత్రంతో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు. త్వరలోనే నేరుగా తెలుగు దర్శకుడితో పనిచేయనున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ నటించనున్నారు. అలానే తెలుగులో ‘సార్’​ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు.

ధనుష్‌ నమ్మేది ఇదే.. పనే దైవం.. అవకాశాలు ఎప్పుడూ రావు.. వచ్చినప్పుడు నిజాయతీతో కష్టపడి పనిచేయాలంటారు. రూపం ముఖ్యం కాదు ప్రతిభ ముఖ్యం అనే మాటని బాగా నమ్ముతారు.

చదువుకి అక్కడితో ఫుల్‌స్టాప్‌.. ‘పదో తరగతి వరకు బాగా చదివాను. ప్లస్‌ వన్‌ (ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం)లో ఫస్ట్‌లవ్‌ పుట్టింది. చదువు అటకెక్కింది’ అని ఓ సందర్భంలో చెప్పారు ధనుష్‌. ‘తొలిప్రేమ ఎవరికైనా మధుర జ్ఞాపకమే కదా! ఫోకస్‌ అంతా తనమీదే పెట్టాను. కాల్స్‌, లెటర్స్‌, ఈ మెయిల్స్‌ అదే పనిలో ఉండేవాణ్ని. అలా ప్లస్‌వన్‌ పూర్తవకముందే నటుడయ్యాను’ అని తన మనసులో మాట పంచుకున్నారు. అప్పటికి ధనుష్‌కి 16 ఏళ్లు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఉన్న వారిలో ధనుష్‌ ఒకరు. ‘నటనంటే ఆసక్తి లేని నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది.. నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, నాతో పనిచేసిన దర్శకనిర్మాతలు, అభిమానులు’ అని చెప్పే నిరాడంబరుడు ధనుష్‌కి జన్మదిన శుభాకాంక్షలు.

Read more RELATED
Recommended to you

Latest news